
రైతులు ఆందోళన చెందొద్దు
● మంత్రి ధనసరి సీతక్క
ములుగు: పండించిన ధాన్యాన్ని విక్రయించే విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క భరోసానిచ్చారు. ఈ మేరకు జిల్లాలో కురిసిన వర్షం, రైతుల పరిస్థితి, కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలను శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పండించిన ప్రతీగింజను మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తామన్నారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తుందని వెల్లడించారు. తమది రైతు ప్రభుత్వమని, రైతన్నలకు అండగా ఉంటామన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలోనూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మరో రెండు రోజుల పాటు వరుసగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి సీతక్క సూచనలతో సివిల్ సప్లయీస్ డీఎం రాములు, ఇతర శాఖల అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను తరలించారు.