నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు

శారద ఫర్టిలైజర్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు  - Sakshi

ఏటూరునాగారం: కొత్త రకం వరి వంగడాలు వచ్చాయని ఫర్టిలైజర్‌ యజమానులు చెప్పిన మాటలు నమ్మి రైతులు మోసపోయిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని శారద ఫర్టిలైజర్‌ షాపు ఎదుట బాధితుల రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు జాడి భోజారావు, కుమ్మరి నరేష్‌, కుమ్మరి మల్లేష్‌, జాడి హరిబాబులు మాట్లాడుతూ సిరి సూపర్‌ 64 పేరుతో వరి విత్తనాలను శారద ఫర్టిలైజర్‌, సాయితేజ ఫర్టిలైజర్ల ద్వారా కొనుగోలు చేశామన్నారు. డిసెంబర్‌ యాసంగి సాగులో భాగంగా మండల వ్యాప్తంగా సుమారు 200ల ఎకరాల్లో ఈ రకం విత్తనాలతో పంటలను సాగు చేసినట్లు తెలిపారు. అనుకున్నంత ఎదుగుదల లేకపోవడంతో వివిధ రకాల పురుగు మందులను కూడా పిచికారీ చేశామని, అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో విత్తనాలు నకిలీవి అని నిర్ధారించుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని సదరు విత్తన కంపెనీకి చెందిన మహేందర్‌రెడ్డిని నిలదీయగా, ఆ రకం విత్తనాలు ఫెయిల్‌ అయ్యాయని ఒప్పుకున్నాడని, తాను బాధ్యత వహిస్తానని చెప్పి మభ్యపెట్టినట్లు ఆరోపించారు. మూడు నెలలనుంచి ఫర్టిలైజర్లు, ప్రతినిధి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందన లేదన్నారు. తాము మోసపోయామని ఏడీఏ, ఏఓలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని రైతులు వాపోయారు. నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాల్లో వ్యవసాయ అధికారుల మద్దతు ఉండడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏడీఏ, ఏఓలు పట్టింపులేని తనం

శారద ఫర్టిలైజర్‌ ఎదుట రైతుల నిరసన

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top