Yashoda: సమసిన ‘ఇవ–యశోద’ చిత్ర వివాదం.. 

Yashoda Movie And EVA IVF Controversy Closed - Sakshi

లోక్‌ అదాలత్‌ వేదికగా పరిష్కారం  

సాక్షి,సిటీబ్యూరో: సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్ర విషయంలో నిర్మాత, దర్శకులు, ‘ఇవ–ఐవీఎఫ్‌’ సంస్థ మధ్య తలెత్తిన వివాదం శుక్రవారం సిటీ సివిల్‌ కోర్టు లోక్‌ అదాలత్‌ సమక్షంలో సుఖాంతంగా ముగిసింది. రెండో అదనపు చీఫ్‌ జడ్జ్‌ కె.ప్రభాకర్‌ రావు చొరవతో ఇరు వైపుల నుంచి సానుకూల స్పందన రావడంతో న్యాయస్థానంలో ఈ సమస్య రాజీ మార్గంలో సమసిపోయింది.

‘ఇవ–ఐవీఎఫ్‌’ సంస్థను కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, చిత్రం షూటింగ్‌ సమయంలో ట్రేడ్‌ మార్క్‌ విషయంలో తెలియక జరిగిన పొరపాటు వల్లనే ఈ వివాదం తలెత్తిందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.  ఇకపై సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా ఆ సంస్థ పేరును ఉచ్చరించే డైలాగులను, సంస్థ లోగో దృశ్యాలను చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు ‘ఇవ–ఐవీఎఫ్‌’ యాజమాన్యానికి తెలియజేయడంతో పాటు రాత పూర్వక హామీ ఇచ్చారు.

దీంతో సిటీ సివిల్‌ కోర్టులో ‘ఇవ–ఐవీఎఫ్‌’ దాఖలు చేసిన పిటిషన్‌ను మేనేజింగ్‌ డైరెక్టర్‌ మోహన్‌రావు చిత్ర బృందంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాజీ పడి ఉపసంహరించుకున్నారు. ‘ఇవ–ఐవీఎఫ్‌’ ప్రతిష్టను దిగజార్చేలా చిత్రంలో సన్నివేశాలున్నాయంటూ మోహన్‌రావు నవంబరు మూడో వారంలో సిటీ సివిల్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన రెండవ అదనపు చీఫ్‌ జడ్జి కె.ప్రభాకర రావు డిసెంబరు 30 వరకు ఓటీటీ ప్లాట్‌ఫారంలో యశోద చిత్రాన్ని విడుదల చేయవద్దంటూ ఆదేశాలు జారీచేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top