అల్లూరి బయోపిక్‌లో నేను కూడా ఓ పాత్ర పోషిస్తున్నా: ఎంపీ

Vizag MP MVV Satyanarayana Comments On Alluri Sitarama Raju Biopic - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాస్తవానికి దగ్గరగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్‌ మూవీని తీస్తున్నట్లు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. పద్మనాభం జిల్లా పరిషత్‌ బంగ్లా వద్ద క్లాప్‌ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ఆయన ప్రారంభించారు. అల్లూరి జన్మస్థలానికి దగ్గరగా ఉన్న పద్మనాభంలో ఆయన జీవిత చరిత్రపై సినిమా తీయడం గొప్ప విషయమన్నారు. బ్రిటీష్‌ వారితో వీరోచితంగా పోరాడిన యుద్ధఘట్టాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో సూపర్‌స్టార్‌ కృష్ణ అల్లూరి గురించి తీసిన చిత్రంలా కాకుండా బంధువులు తెలిపిన వివరాల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు చెప్పారు. ఈ సినిమా తీయడానికి ఆయన బంధువులు ముందుకు రావడం విశేషమన్నారు.

ఈ చిత్రంలో తాను కూడా ఓ పాత్రను పోషిస్తున్నట్టు ఎంవీవీ తెలిపారు. డైరెక్టర్‌ వెంకట్‌ పంపన మాట్లాడుతూ 45 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసి ఓటీటీ ప్లాట్‌ఫారంలో రిలీజ్‌ చేస్తామని తెలిపారు. పద్మనాభంలోని జిల్లా పరిషత్‌ అతిథి గృహాన్ని పోలవరం బ్రిటీష్‌ కలెక్టర్‌ కార్యాలయంగా తీర్చిదిద్ది సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నిర్మాతగా ఆర్‌.ఎస్‌.సత్యనారాయణరాజు వ్యవహరిస్తున్నారు.అల్లూరిగా శివవర్మ, గంటం దొరగాడి.జి.రమేష్‌ మల్లు దొరగా రాఘవ కీలక పాత్రలను పోషిస్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.రఘువర్మ, పి.సూర్యనారాయణరాజు(సురేష్‌బాబు), వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి సుంకర గిరిబాబు, ఆర్‌ఎస్‌ దేముడుబాబు, అముజూరి అప్పారావు పాల్గొన్నారు.   

పద్మనాభంలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన విశాఖ ఎంపీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top