
తనతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడతాడన్న తాప్సీ.. అదేం లేదన్న నటుడు
ముంబై: రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు తాను భయపడతానన్న హీరోయిన్ తాప్సీ పన్ను వ్యాఖ్యలపై నటుడు విక్రాంత్ మాసే స్పందించాడు. నటన తన జీవితంలో భాగమని, తానెప్పుడూ ఇలాంటి వాటికి భయపడనని పేర్కొన్నాడు. తాప్సీ ఏదో సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే హెడ్‌లైన్స్ వేసి మరీ ప్రచారం చేశారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఏదేమైనా తమకు ఇటువంటి వార్తల వల్ల మరింత పబ్లిసిటి వస్తుందని పేర్కొన్నాడు.
కాగా తాప్సీ పన్ను, విక్రాంత్ మాసే, హర్షవర్దన్ రాణె పర్ధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హసీన్ దిల్‌రూబా’. జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాప్సీ మాట్లాడుతూ... ‘‘విక్రాంత్, హర్షవర్దన్ రొమాంటిక్ సీన్లలో నటించేందుకు భయపడ్డారు. నా ఇమేజ్ గురించి భయపడ్డారో లేదంటే మరేదైనా కారణమో తెలియదు. నేను ప్రతిసారి ఈ విషయం గురించి డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసేదాన్ని’’ అని వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై విక్రాంత్ స్పందిస్తూ... ‘‘ అలాంటిదేమీ లేదు. తాప్సీ చాలా సరదా మనిషి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. వాగుడుకాయ కూడా. ఐదు నిమిషాలకు మించి సైలెంట్‌గా ఉండలేదు. తనేదో సరదాకి మా గురించి అలా మాట్లాడింది. కానీ, వార్తల్లోకొచ్చేసరికి తను మా గురించి సీరియస్‌గా కామెంట్ చేసినట్లు వక్రీకరించారు. ఏదైతేనేం మాకు కావాల్సినంత ప్రచారం దొరుకుతోంది. నిజానికి మీడియాతో మా అనుబంధం విడదీయరానిది.
మేం దాని గురించి ఎప్పుడూ బాధపడం. నటన నా మొదటి ప్రాధాన్యం. నేను దేనికీ భయపడను. అయితే, కొన్ని సన్నిహిత సన్నివేశాల్లో ఒక్కోసారి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ... ఇద్దరు నటుల మధ్య పరస్పర సహాయసహకారాలు, ప్రొఫెషనలిజం ఉన్నపుడు అదేమీ పెద్ద విషయం కాబోదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా కనికా థిల్లాన్ కథ అందించిన హసీన్ దిల్‌రూబా సినిమాను వినీల్ మాథ్యూ తెరకెక్కించాడు.