
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గతంలో తన పేరు ముందు 'ది' ట్యాగ్‌ని ఉపయోగించిన తర్వాత, దానిని వివాదాస్పదంగా భావించి, అభిమానులకు తొలగించమని సూచించారు. దీనిపై తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ఆ ట్యాగ్ ఇతర హీరోలతో పాటు వారి అభిమానులకు ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదని, తన పేరు ముందు 'ది' ఉపయోగించడం సరికాదనే నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
లైగర్ సినిమా విడుదల సమయంలో ఆయన పేరు ముందు సౌత్ సెన్సేషన్ అని చేర్చారు. దీంతో విజయ్ దేవరకొండపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగిందని ఇలా గుర్తుచేసుకున్నారు. 'లైగర్ సమయంలో నా పేరు ముందు ఒక ట్యాగ్‌లైన్ చేరుస్తున్నట్లు నా టీమ్ ఒత్తిడి చేసింది. నాకు ఆ ట్యాగ్ అక్కర్లేదు అంటూ వారికి చెప్పాను. దానిని చాలా కాలం పాటు వారితో ప్రతిఘటించాను. నా పేరుతోనే నాకు పేరు రావాలని మాత్రమే కోరుకున్నాను. కానీ మీడియాలో అప్పటికే సౌత్ సెన్సేషన్, రౌడీ స్టార్ వంటి ఇతర ట్యాగ్‌లైన్స్ నా పేరు ముందు చేరిపోయాయి.' అని ఆయన గుర్తు చేసుకున్నారు.
అయితే, తన పేరు ముందు ఈ ట్యాగ్ లైన్స్ ఉండటం వల్ల కొందరికి ఇబ్బంది కలిగిందని అప్పుడే తొలగించాలని కోరినట్లు విజయ్ చెప్పారు. అయితే, తన పేరు ముందు 'ది' అని మాత్రమే ఉపయోగించాలని గతంలో ఆయన సూచించినట్లు గుర్తుచేసుకున్నారు. కానీ, అది కూడా వివాదాస్పదం కావడంతో దానిని కూడా తొలగించాలని అభిమానులకు సూచించినట్లు విజయ్ చెప్పారు. తన పేరు ముందు ఎలాంటి ట్యాగ్ చేర్చవద్దని తన అభిమానులను కోరినట్లు ఆయన గుర్తచేసుకున్నారు. తనను విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవమని కోరానన్నారు.
ఏ హీరోలకు ఇలా జరగలేదు: విజయ్
తన పేరు ముందు ఎలాంటి ట్యాగ్స్ అవసరం లేదని విజయ్ దేవరకొండ తాజాగా ఇలా చెప్పారు. 'నా పేరుకు ముందు 'ది' అనే పదం జోడించబడినందున విపరీతమైన వ్యతిరేఖత వచ్చింది. అలా వివాదాస్పదం కావడంతో తొలగించాలని అభిమానులకు అప్పుడే చెప్పాను. కానీ, చాలామంది హీరోలకు తమ పేరుకు ముందు ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. ఇలాంటి ట్యాగ్ వల్ల ఇతర ఏ హీరోలకు తగలనన్ని ఎదురుదెబ్బలు నాకు మాత్రమే తగిలాయి. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఉన్న వారికి యూనివర్సల్ స్టార్ నుండి పీపుల్స్ స్టార్ వరకు ఏ పేరు అయినా ఉండవచ్చు తప్పు లేదు. నాకంటే చిన్నవారు, నాకంటే పెద్దవారు, నాకంటే ముందు అరంగేట్రం చేసినవారు ఇలా ప్రతి ఒక్కరికీ ఒక ట్యాగ్‌లైన్ ఉంటుంది. బహుశా నాకు మాత్రమే అలాంటివి లేవు. ఇలా మరెవరికీ ఎదురుదెబ్బ తగలకూడదు.' అని ఆయన అన్నారు.