
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. జూలై 25న రావాల్సిన కింగ్డమ్ మరో ఆలస్యంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెలాఖర్లో బిగ్ స్క్రీన్‌పై కింగ్డమ్ రిలీజ్ కానుంది. ఓ స్పెషల్ వీడియోతో కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్క్రిప్ట్ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటున్నట్లు వెల్లడించారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో మనకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ బాగాలేదు.. ఈ సినిమా నేను చేయను.. అని ముక్కుసూటిగా చెప్పలేం. గతంలో నాకు ఇంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న నటుడికే అవకాశం వస్తే.. ఆ స్క్రిప్ట్ను చేయనని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి వచ్చి మరో మూడు, నాలుగు నెలలు ఆగండి. వీలైతే ఎక్కువమంది రైటర్లను తీసుకొస్తానని అంటాడు. నేనైతే ఇటీవల స్క్రిప్ట్‌ల విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నా. నా దగ్గరకు వచ్చిన దర్శకులతో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు డబ్బుతో పాటు కెరీర్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేసేదానితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నా. స్క్రిప్ట్‌తో ఓకే అనిపించిన తర్వాతే ముందుకు వెళ్తున్నా' అని అన్నారు.
కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిటారు. ఈ యాక్షన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.