వారసులు వస్తున్నారు | Upcoming Movies Updates: Entry of Some actors heirs into Film Industrys | Sakshi
Sakshi News home page

వారసులు వస్తున్నారు

Jun 3 2026 3:58 AM | Updated on Jun 3 2026 3:58 AM

Upcoming Movies Updates:  Entry of Some actors heirs into Film Industrys

తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ... ఇలా ఇండస్ట్రీ ఏదైనా వారసులు వస్తుండటం సాధారణం. తమ కుమారులను, కుమార్తెలను హీరోలుగా, హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నారు పలువురు హీరో, హీరోయిన్లు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల వారసులు వెండితెరపై అరంగేట్రం చేస్తున్నారంటే వారి అభిమానులకు పండగే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా ఇటు సగటు సినీ ప్రేమికుల్లోనూ వారు నటిస్తున్న సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ కారణంగా నటీనటుల వారసులను పరిచయం చేసేందుకు చాలామంది దర్శక–నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు.

నూతన నటీనటులు పరిచయం అయ్యే చిత్రాలకంటే వారసులు అరంగేట్రం ఇచ్చే సినిమాలపై ట్రేడ్‌ వర్గాల్లోనూ ఫుల్‌ క్యూరియాసిటీ ఉంటుంది. ఈ కోవలోనే ప్రస్తుతం అరడజను మందికి పైగా వారసులు వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. హీరో–హీరోయిన్ల వారసులే కాదు. నిర్మాతల వారసులు కూడా నటీనటులుగా ఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తండ్రి విజయ్‌ స్టార్‌ హీరో అయినప్పటికీ తాను మాత్రం తెరపై కాకుండా తెరవెనక ఉంటానని దర్శకుడిగా మారారు హీరో విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌. ప్రస్తుతం హీరోలుగా, హీరోయిన్లుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న వారసులు ఎవరు? వారి వివరాలేంటి? 
ఆ సినిమాలేంటి? వంటి విషయాలపై ఓ లుక్‌ వేద్దాం...

ఘట్టమనేని జయకృష్ణ 
ఘట్టమనేని కుటుంబంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ తొలి తరం కథానాయకుడు. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను అలరించారాయన. ఆయన నట వారసులుగా రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, మంజుల తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.  ఘట్టమనేని కుటుంబంలో మూడో తరంగా మహేశ్‌బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్‌ ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యాడు. అయితే తాజాగా సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌బాబు (మహేశ్‌బాబు సోదరుడు) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్‌ అజయ్‌ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 

అశ్వినీదత్‌ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్‌ ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ నుంచి తన అన్న కొడుకు జయకృష్ణ పవర్‌ఫుల్‌ ఫస్ట్‌ లుక్‌ను హీరో మహేశ్‌బాబు లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. దుమ్ము, ధూళి ఎగసే రగ్డ్‌ బ్యాక్‌డ్రాప్‌లో హై స్పీడ్‌లో బైక్‌ నడుపుతూ కనిపించారు జయకృష్ణ. ఓ చేత్తో బైక్‌ను పట్టుకుని, మరో చేత్తో గన్‌ టార్గెట్‌గా పెట్టిన విధానం, చుట్టూ మోషన్‌ బ్లర్, అతని కళ్లలో కనిపించే ఫోకస్‌... ఇలాంటివి ఉన్న ఈ ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన యాక్షన్‌ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ‘‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో అద్భుతమైన ప్రేమకథతో  పాటు యాక్షన్, రొమాన్స్‌ వంటి అంశాలు కూడా ఉన్నాయి. తన  పాత్ర కోసం జయకృష్ణ చాలా ఎఫర్ట్‌ పెట్టారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

నందమూరి తారక రామారావు 
చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబంలో నందమూరి తారక రామారావు తొలి తరం హీరో. ఆయన తర్వాత రెండో తరంగా హరికృష్ణ, బాలకృష్ణ వంటి వారు నటులుగా ఎంట్రీ ఇచ్చారు. మూడో తరంలో ఎన్టీఆర్, తారక రత్న, కల్యాణ్‌ రామ్‌ తదితరులు చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. తాజాగా నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం వెండితెరకు పరిచయం అవుతోంది. నందమూరి తారక రామారావు ముని మనవడు, హరికృష్ణ మనవడు, నిర్మాత జానకిరామ్‌ (హీరో కల్యాణ్‌ రామ్‌ సోదరుడు) తనయుడు నందమూరి తారక రామారావు టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అవుతున్నారు.

‘సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్‌’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన వైవీఎస్‌ చౌదరి.. నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయన స్వీయ రచన, దర్శకత్వంలో ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ మూవీ నిర్మిస్తున్నారు. 2025 మే 12న ఈ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున నందమూరి తారక రామారావు మాట్లాడుతూ– ‘‘మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకిరామ్‌గార్ల ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయి. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘1980ల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. తెలుగు సాహిత్యం, తెలుగు సంప్రదాయం, తెలుగు భాష, హైందవ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే కథతో ఈ మూవీ రూపొందుతోంది’’ అన్నారు వైవీఎస్‌ చౌదరి.

తెలుగమ్మాయి వీణా రావు అరంగేట్రం...  
ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన వైవీఎస్‌ చౌదరి ఇప్పుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం ద్వారా తెలుగమ్మాయి వీణా రావుని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. తెలుగమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేయాలనే సంకల్పంతో ఆడిషన్స్‌ నిర్వహించారు వైవీఎస్‌. ఈ అవకాశం ఫైనల్‌గా వీణా రావుని వరించింది. ఆమెకు చిత్ర పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.  

రాషా తడాని... 
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, అభిమానులను సొంతం చేసుకున్నారు హీరోయిన్‌ రవీనా టాండన్‌. తెలుగులో వినోద్‌ కుమార్‌తో ‘రథసారధి’, బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’, నాగార్జునతో ‘ఆకాశ వీధిలో’, మోహన్‌బాబుతో ‘ పాండవులు  పాండవులు తుమ్మెద’ వంటి సినిమాల్లో నటించారు రవీనా టాండన్‌. యశ్‌ హీరోగా రూపొందిన కన్నడ ఫిల్మ్‌ ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’లో ప్రధాన మంత్రిగా తనదైన నటనతో  పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె.

రవీనా కుమార్తె రాషా తడాని తెలుగులో ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన ఆమె ఫస్ట్‌ లుక్స్‌ పోస్టర్స్‌ ఆకట్టుకున్నాయి. టీజర్, సాంగ్స్‌లోనూ తనదైన అందం, అభినయంతో కనిపించారు రాషా తడాని. ‘‘శ్రీనివాస మంగాపురం’ మూవీ తెలుగులో నాకు బెస్ట్‌ ఎంట్రీ అవుతుంది’’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాషా తడాని.

జోవిక విజయ్‌ కుమార్‌...  
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటీనటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు మంజుల, విజయ్‌ కుమార్‌. వారి కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసి, ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. కాగా ‘దేవి’ సినిమా ద్వారా వనితను తెలుగులో పరిచయం చేశారు దర్శక–నిర్మాత ఎంఎస్‌ రాజు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశీల  పాత్రలో నటించారు వనిత. 1999 మార్చి 12న విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలవడంతో వనితకి తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. ‘దేవి’ చిత్రం ద్వారా ఆమెను తెలుగులో పరిచయం చేసిన ఎంఎస్‌ రాజు ఇప్పుడు ఆమె కుమార్తె జోవికా విజయ్‌ కుమార్‌ని ‘అగధ’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేస్తుండటం విశేషం.

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి కీలక  పాత్రలు పోషించిన చిత్రం ‘అగధ’. ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రోడక్షన్స్‌ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ మూవీలో హరిణి  పాత్రలో జోవిక విజయ్‌కుమార్‌ నటించారు. ఇటీవల ఆమె క్యారెక్టర్‌ పోస్టర్‌ విడుదల చేశారు. జోరున కురుస్తోన్న వర్షంలో చేతిలో కత్తి పట్టుకుని కోపంగా చూస్తున్న ఆమె లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కి అనూహ్యమైన రెస్పాన్స్‌ వచ్చింది. 

ైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో జోవికా విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘అగధ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎం.ఎస్‌. రాజుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ మూవీలో నా ఫస్ట్‌ లుక్‌ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజులగారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా, అందులో నా నటన అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నాను’’ అని తెలి పారు. ‘అగధ’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి రాకేష్‌ వెంకటాపురం సంగీతం అందించారు.

ప్రియాంక రాజకుమార్‌... 
దేవయాని... ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ‘సుస్వాగతం’ మూవీ గుర్తుకొస్తుంది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు దేవయాని. 1998 జనవరి 1న విడుదలైన ఈ మూవీ మంచి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. తెలుగుతో  పాటు హిందీ, బెంగాలీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి, అందం, అభినయంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు దేవయాని. ‘శ్రీమతీ వెళ్లొస్తా, చెన్నకేశవ రెడ్డి, నాని, జనతా గ్యారేజ్, అరవింద సమేత వీరరాఘవ’ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారామె. దర్శకుడు రాజకుమార్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు దేవయాని.

వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తె ప్రియాంకని ‘రంజన్‌: ది అడ్వకేట్‌’ మూవీ ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు దేవయాని. ‘జీన్స్‌’ మూవీ ఫేమ్‌ ప్రశాంత్‌ టైటిల్‌  పాత్రను పోషిస్తున్నారు. ఆయన తండ్రి త్యాగరాజన్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘కోర్ట్‌’ మూవీకి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించేలా దర్శకుడు రామ్‌ జగదీశ్‌ తెరకెక్కించిన ‘కోర్ట్‌’ సినిమా తెలుగులో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల చెన్నైలో ‘రంజన్‌: ది అడ్వకేట్‌’ చిత్రం ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ‘కోర్ట్‌’ మూవీలో శ్రీదేవి పోషించిన  పాత్రలో ప్రియాంక నటిస్తున్నారు.  

హరి ఎంట్రీ...  
‘రంజన్‌: ది అడ్వకేట్‌’ మూవీ ద్వారా నిర్మాత ఎస్‌. కథిరేశన్‌ తనయుడు హరి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ‘కోర్ట్‌’ సినిమాలో హర్‌‡్ష రోషన్‌ పోషించిన  పాత్రను తమిళంలో హరి చేస్తున్నారు.  

సుహానా ఖాన్‌ ఆగయా...
బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న చిత్రం ‘కింగ్‌’. షారుక్‌తో ‘పఠాన్, ఫైటర్‌’లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ‘కింగ్‌’కి దర్శకత్వం వహిస్తున్నారు. షారుక్‌ ఖాన్‌ సొంత బ్యానర్‌ అయిన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌పై ఆయన భార్య గౌరీ ఖాన్, సిద్ధార్థ్‌ ఆనంద్, మమత ఆనంద్‌ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా షారుక్‌ ఖాన్‌  కుమార్తె సుహానా ఖాన్‌ బాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో అభిషేక్‌ బచ్చన్, దీపికా పదుకోన్, అనిల్‌ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్‌ వార్సి, రాణీ ముఖర్జీ తదితరులు ఇతర  పాత్రలు పోషిస్తున్నారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుహానా ఖాన్‌ కూడా పలు యాక్షన్‌ సన్నివేశాల్లో  పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తండ్రి షారుక్, తనయ సుహానా స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న తొలి చిత్రం ‘కింగ్‌’ కావడం విశేషం. ఈ సినిమాపై బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది.  

డైరెక్టర్‌గా ఎంట్రీ...
తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్‌ హీరోల్లో విజయ్‌ ఒకరు. హీరోగా కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నారాయన. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తన తండ్రి స్టార్‌ హీరో అయినప్పటికీ ప్రస్తుతానికి నటన వైపు మొగ్గు చూపకుండా... దర్శకుడిగా మారారు జేసన్‌ సంజయ్‌. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’.

ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ప్రకటన నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. పైగా ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో ఈ మూవీ మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘సిగ్మా స్టయిల్‌...’ అంటూ సాగే  పాటని ఈ నెల 4న రిలీజ్‌ చేయనున్నారు.

 లైకా ప్రోడక్షన్స్‌ పై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానుంది. జేసన్‌ సంజయ్‌ మాట్లాడుతూ– ‘‘సిగ్మా’ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం. నా విజన్‌ను నమ్మి ప్రతి దశలోనూ అండగా నిలిచిన సుభాస్కరన్‌గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం ఎంతో నిబద్ధతతో పని చేస్తూ, నాకు పూర్తి సహకారం అందిస్తున్న నటీ నటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. 
పైన పేర్కొన్నవారే కాదు.. మరికొంత మంది వారసులు కూడా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.  

– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement