ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ | UI Movie Review And Rating Telugu | Sakshi
Sakshi News home page

UI Review Telugu: 'యూఐ' మూవీ రివ్యూ

Dec 20 2024 1:48 PM | Updated on Dec 20 2024 3:01 PM

UI Movie Review And Rating Telugu

హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో. కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి మరి! 25 ఏళ్ల క్రితమే 'ఏ', 'ఉపేంద్ర' లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్‌ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!

(ఇదీ చదవండి: Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ)

కథేంటి?
ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఎలా ఉందంటే?
సినిమా అంటే హీరోహీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్న్‌లు.. ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. 'యూఐ' చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాణెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి రెండున్నర గంటల పాటు పరీక్ష పెడుతుంది.

సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. 'మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి' అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా 'యూఐ' సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్శ్‌ని గుర్తుచేసేలా కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు 'యూఐ' సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని.. నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడి రాసి, మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కిరణ్ ఆదర్శ్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్‌ని అతడు చితక్కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలొచ్చేలా కొడతారు. అక్కడి నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటెటో పోతూ ఉంటుంది. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు.

భూమ్మీద తొలి జంట ఆడమ్-ఈవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి.. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. 'మీ కామం వల్ల పుట్టాడు. కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా?' లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.

ఎవరెలా చేశారు?
ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే! హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. మూడు నాలుగు సీన్లు ఉంటాయంతే! ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.

టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటైరికల్‌గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్‌కి ముడిపెట్టి.. వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్!

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరివరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా.. కొంచెం వింతగా ఉంది.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?)

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement