
టాలీవుడ్ యాంకర్ ఉదయభాను కేవలం యాంకరింగ్ మాత్రమే కాదు.. నటిగానూ అభిమానులను మెప్పించింది. పలు చిత్రాల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఉదయభాను నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ మూవీలో ఉదయభాను ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు. మెగాస్టార్ బర్త్ డే రోజున అంటే ఆగస్ట్ 22న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రెస్మీట్కు హాజరైన ఉదయభాను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మెగాస్టార్ గురించి కూడా మాట్లాడారు. చిరంజీవికి తానంటే చాలా ఇష్టమని తెలిపారు. నన్ను అభినందించి మొదటి ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది చిరంజీవినే అని ఉదయభాను వెల్లడించారు. ఈ విషయాన్ని తానెప్పుడు చెప్పలేదని అన్నారు. మా సినిమా మెగాస్టార్ బర్త్ డే రోజు విడుదలవ్వడం ఆనందంగా ఉందని ఉదయభాను సంతోషం వ్యక్తం చేశారు.
ఇటీవల యాంకర్గా మిమ్మల్ని తొక్కేస్తున్నారని చేసిన కామెంట్స్పై ఉదయభానుకు ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ నేనెప్పుడు నిజాలే మాట్లాడతానని ఉదయభాను అన్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడానికి ఇది సందర్భంగా కాదని తెలిపారు. ఈ విషయంపై ఎవరిని అడిగినా నిజాలే మాట్లాతారని ఉదయభాను అన్నారు.
కాగా.. సత్యరాజ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్.సింహ, సాంచి రాయ్ కీలకపాత్రల్లో నటించారు.