ప్రముఖ బుల్లితెర నటి సంభావనా సేథ్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమె తాజాగా కవల బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమెకు ఓ పాప, బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తల్లిదండ్రులుగా మారే ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సంభావనకు శుభాకాంక్షల చెబుతున్నారు.
నటి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ సంవత్సరం మహా దీపావళి ముందుగానే వచ్చింది. లక్ష్మీదేవి, గణేశుడు ఇద్దరూ మా ఇంటికి వచ్చేశారు. ఈ సమయంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. హర హర మహాదేవ్' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కాగా.. నటి సంభావన సేథ్.. నటుడు-రచయిత అవినాష్ ద్వివేదిని పెళ్లాడారు.
కాగా.. గతంలో సంభావనా సరోగసీ ద్వారా బిడ్డను ఆశిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక ఒత్తిడి గురించి సంభావన మాట్లాడింది. ఈ ప్రక్రియలో భాగంగా మూడు నెలల పాటు 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు సంభావన, అవినాష్‌ల వివాహం జూలై 14, 2016న జరిగింది.


