Srihari Death anniversary: రియల్‌ స్టార్‌ తీరని కోరికలు

Tollywood Real Star Srihari Death anniversay special - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రియల్‌ స్టార్‌, విలక్షణతకు పెట్టింది పేరైన శ్రీహరి. తనదైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించిన నటుడుశ్రీహరి. మంచి మనిషిగా కూడా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు.  పేదరికం, ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా తన సాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా ఆదుకున్న ఆప్తుడుగా నిలిచాడు. కరియర్‌ సాఫీగా పోతున్న తరుణంగా  తీవ్ర అనారోగ్యంతో  2013, అక్టోబరు 9న కన్నుమూయడంతో  అటు శ్రీహరి కుటుంబం, ఇటు రియల్ స్టార్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

1964 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు శ్రీహరి.  యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఆసక్తినిపెంచుకున్న శ్రీహరి అనేక పోటీల్లో పాల్లొనడంతో పాటు ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచు కున్నాడు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర చాంపియన్ అయిన శ్రీహరి మంచి అథ్లెట్ అవ్వాలనుకున్నారట. ఈ క్రమంలో జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా  నటనపై మక్కువ సినిమాలవైపు నడిపించింది. దీంతో ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా తీరలేదట. అలాగే పాలిటిక్స్‌ అన్నా కూడా చాలా అసక్తి ఉండేది. కచ్చితంగా  రాజకీయాల్లోకి ఎంటర్‌ కావాలనీ, తద్వారా నలుగురికీ సహాయం చేయాలని ఆయన అనుకునేవారట.(అప్పుడు ఎంత అంటే అంత!)

1986లో స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి  ఆ తరువాత నటుడుగా తన కరియర్‌కు బలమైన పునాదులు వేసుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ప్రత్యేక డైలాగ్‌ డెలివరీతో భారీ క్రేజ్‌ సంపాదించుకున్నారు. హీరోగా, నిర్మాతగా  కూడా తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 900 చిత్రాల్లో నటించి రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. పృధ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు ఇలా దాదాపు 28 చిత్రాల్లో హీరోగా చిత్రాల్లో రాణించారు.  వీటితోపాటు బావగారు బావున్నారా, వీడెవండిబాబూ,  తాజ్ మహల్, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం సినిమాల్లో ఆయన నటన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో చెల్లెలి కోసం ఆరాటపడే అన్నగా తన నటనతో నూటికి నూరుశాతం మార్కులు కొట్టేశారు. రాంచరణ్ హీరోగా  తెరకెక్కిన సూపర్‌ డూపర్‌  మగధీరలో షేర్ ఖాన్ పాత్ర, ఆయన కరియర్‌ గొప్ప మైలురాయి లాంటిది. ఒక విధంగా ఈ సినిమాకు ఆయన నటన పెద్ద హైలెట్‌.  2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అదే ఏడాదికి ఇదే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

నటి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు శ్రీహరి. వీరికి ఇద్దరు కుమారులు  శశాంక్‌, మేఘాంశ్‌ ఉన్నారు.   హీరోగా రాణించానేది మేఘాంశ ఆకాంక్ష. అయితే నాలుగు నెలల కుమార్తె అక్షర అకాల మరణం శ్రీహరిని మానసికంగా కృంగదీసింది. అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడ అభివృద్ధికి కృషి చేయడం విశేషంగా నిలిచింది. కాగా ప్రభుదేవా దర్శకత్వంలో రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూసారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top