టాలీవుడ్ నిర్మాత కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నైల్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుందామని బీచ్‌కు వెళ్లానని తెలిపారు. కానీ అక్కడ ఓ అమ్మాయి తన జీవితాన్ని కాపాడిందని అన్నారు. రెండు కాళ్లు, చేతులు లేని అమ్మాయిని చూసి నా నిర్ణయం మార్చుకున్నాని వెల్లడించారు. రేపు అనేది తెలియని ఆ అమ్మాయి.. వాళ్ల తమ్ముడు బండి తోస్తుంటే బెలూన్స్ అమ్ముతూ బతికినప్పుడు.. నేను ఎందుకు బతకలేనని అనుకున్నానని కోన వెంకట్ తెలిపారు. నా కోసం ఆ దేవుడే ఆ అమ్మాయిని పంపించాడని అనుకుంటానని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
ఈ సంఘటన 1997లో జరిగిందని కోన వెంకట్ చెప్పారు. ఒక 50 నిద్రమాత్రలు తీసుకుని.. నా దగ్గర ఉన్న చివరి డబ్బులతో వాటర్ బాటిల్ తీసుకున్నానని తెలిపారు. ఆ అమ్మాయి నాకు కనిపించి ఉండకపోతే ఈ రోజు కోన వెంకట్ అనేవాడు లేడన్నారు. ఆ తర్వాత నేను చాలా సినిమాలకు కథలు రాశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలాసార్లు అమ్మాయి కనిపిస్తుందేమోనని బీచ్‌లో వెతుక్కుంటూ వెళ్లానని అన్నారు. కానీ ఎక్కడా కూడా మళ్లీ ఆ అమ్మాయి కనిపించలేదన్నారు. బ్యాండ్‌మేళం థ్యాంక్ యూ మీట్‌కు హాజరైన కోన వెంకట్ తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండు మేళం. ఈ మూవీకి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.


