
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరును తలచుకుని ఎమోషనలయ్యారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ..' కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల దుస్తులు, చిన్నప్పటి నుంచి దాచుకున్న వాటితో సహా ఏది వదలకుండా రోడ్డున పడేశారు. మేము బయటికి కూడా వెళ్లడానికి కార్లు కూడా లేకుండా చేశారు. కానీ నాకు మాత్రం శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు అన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్నా నా కోసం. ప్రతి ఒక్కరూ మేమున్నాం అంటూ నాకోసం నిలబడ్డారు. కానీ నాకొక్కటే బాధ. ఇంత చేసినా.. ఇంత జరిగినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నాపై ఎన్ని కేసులు వేసినా.. నాకు ఎవరి మీద కోపం రావట్లేదు.. బాధగా మాత్రమే ఉంది. అది నా బలహీనతో.. వాళ్ల బలమో నాకు అర్థం కావట్లేదు.' అని అన్నారు.
తన తండ్రి గురించి మాట్లాడుతూ..'ఎన్ని జన్మలైనా.. ఈ జన్మకు మాత్రం నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే.. అది మార్చడం ఎవరి వల్ల కాదు..నా చిన్నప్పటి నుంచి ఆయన నేర్పించిన క్రమశిక్షణే. నీతి వైపు నిలబడాలని నాకు నేర్పించారు. నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కలా అందరూ చేరి తప్పు అంటున్నారు. ఏదేమైనా.. ఎన్ని జన్మలెత్తినా.. మీరే నా దేవుడు.. నా తండ్రి.. నా తల్లి.. మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో మంచు మనోజ్‌కు తన ఫ్యామిలీతో గొడవలు తలెత్తిన సంగతి తెలిసిందే.