
టాలీవుడ్లో సినీ వర్కర్స్ వేతనాల పెంపు కోరుతూ బంద్కు పిలుపునివ్వడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే నైపుణ్యం కలిగిన పే వర్కర్స్ తామివ్వగలిగే వేతనానికి పనిచేస్తారో వాళ్లతో షూటింగ్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలుగు ఫిలిం చాంబర్ ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్ల లేఖను విడుదల చేసింది.
ఎంతోమంది ఔత్సాహిక నిపుణులు/కార్మికులు ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. యూనియన్లలో సభ్యత్వం కొరకు లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ యూనియన్లు అవరోధం కలిగిస్తున్నాయని లేఖలో వివరించింది. ఇది నైపుణ్యవంతులైన కార్మికుల పొట్ట కొట్టడమేనని వెల్లడించింది. ప్రతి ప్రాజెక్టు అవసరాలు, వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా కార్మికులతో కలిసి పనిచేసే పూర్తి స్వేచ్చ నిర్మాతలకు ఉంటుందని తెలిపింది. ఎవరైనా ఔత్సాహిక నిపుణులు / కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారని స్పష్టం చేసింది. లక్షలాది రూపాయలు సభ్యత్వం కొరకు కట్టవలసిన పని లేదు.. నైపుణ్యం ఉన్న కార్మికునికి పని కల్పించడమే మా ధ్యేయమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లేఖ విడుదల చేసింది. మన ఫిలిం ఇండస్ట్రీ మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు అతి ముఖ్యమైన విషయమని కార్మిక సంఘాలు మరొక్కసారి గుర్తించాలని కోరింది.
దాదాపు 30 శాతం వేతనాలు పెంచినవారి షూటింగ్లకే హాజరవ్వాలని టాలీవుడ్లో సినీ వర్కర్స్ యూనియన్ నిర్ణయించడంపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేతనాల పెంపుపై ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియచేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్లాలని నిర్ణయించడం చాలా బాధాకరమని పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయటం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో 30 శాతం వేతనాల పెంపును నిర్మాతలందరూ వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. కనీస వేతనాల చట్టం ప్రకారం ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని కార్మిక శాఖ కమిషనర్ స్పష్టం చేశారని వెల్లడించింది. అంతేకాకుండా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా నిర్మాతల స్వయంప్రతిపత్తిని సమర్థిస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసిందని వివరించింది.
కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో మిగతా మెట్రోపాలిటన్ పట్టణాలతో పోలిస్తే మన హైదరాబాద్లో తక్కువని తెలిపింది. అయిన్పటికీ మనం అన్ని యూనియన్ల వారికి ఎక్కువ వేతనాలు చెల్లించడం జరుగుతోందని పేర్కొంది. ఇతర రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమలో ఇచ్చే వేతనాల కంటే మన తెలుగు రాష్ట్రాలలో పని చేసే కార్మికులకు అధిక వేతనాలు చెల్లిస్తున్నామని వెల్లడించింది.