అంతా ‌మేకప్‌ మాయ..

Tollywood Artists In MakeUp - Sakshi

ముఖం మీద ముడతలు కావాలా? ఉందిగా మేకప్‌. తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా కనబడాలా? మేకప్‌ ఉందిగా. వయసులో ఉన్నవాళ్లు వృద్ధులుగా కనబడాలా? మేకప్‌తో ఏదైనా సాధ్యమే. ప్రస్తుతం కొందరు తారలు వెరైటీగా కనబడే ప్రయత్నంలో ఉన్నారు. మేకప్‌ సహాయంతో నల్లబడుతున్నారు. ముసలివాళ్లవుతున్నారు. అంతా మేకప్‌ మాయ. అప్‌.. అప్‌.. మేకప్‌ అంటూ కొత్త లుక్‌లో కనపడబోతున్న తారల గురించి తెలుసుకుందాం.

ఇప్పటివరకూ కనిపించని లుక్‌లో వెంకటేశ్‌ ‘నారప్ప’ సినిమాలో కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది ‘నారప్ప’. ఇందులో రైతు పాత్రలో కనిపించనున్నారు. మామూలు రైతు కాదు.. అన్యాయాన్ని సహించలేని రైతు. కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి, అక్రమార్కులను అంతం చేసే రైతు. ఈ పాత్రలో వెంకీ రఫ్‌గా కనిపిస్తారు. పైగా రైతు అంటే ఎండల్లో కష్టపడక తప్పదు కదా..  దానికి మ్యాచ్‌ అయ్యేట్లు ఆయన స్కిన్‌ టోన్‌ని కాస్త డల్‌ చేశారు. వెంకీ రైతు అయితే అల్లు అర్జున్‌ లారీ క్లీనర్‌. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్‌ అనే లారీ క్లీనర్‌గా కమిలిపోయిన చర్మంతో కనబడతారు. సరిగ్గా దువ్వని జుట్టు, ట్యాన్‌ అయిన స్కిన్, ఆయిల్‌ మరకలతో బట్టలు.. అల్లు అర్జునేనా? అన్నంతగా మారిపోయారు.

ఇక బాబాయ్‌ వెంకటేశ్‌లానే అబ్బాయ్‌ రానా కూడా ట్యాన్‌ అయ్యారు. ఒక్క సినిమా కోసం కాదు.. రెండు సినిమాలకు. ఒకటి ‘అరణ్య’, ఇంకోటి ‘విరాటపర్వం’. 25ఏళ్లుగా అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక వ్యక్తి కథ ‘అరణ్య’. పర్యావరణం, అడవుల నరికివేత వంటి అంశాలతో సాగే ఈ సినిమాలో అడవిలో నివసించేవాళ్లు ఎలా ఉంటారో అలా కనబడతారు రానా. అలాగే నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘విరాటపర్వం’లో రానా మాత్రమే కాదు కథానాయిక సాయిపల్లవి, కీలక పాత్రలు చేస్తున్న ప్రియమణి, నందితా దాస్‌ కూడా డల్‌ మేకప్‌లోనే కనబడతారు. అందరూ నిజమైన నక్సలైట్లను తలపించేలా మౌల్డ్‌ అయిపోయారు.

ఇప్పటివరకూ మోడ్రన్‌ గాళ్‌లా కనిపించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్‌ వైష్ణవ్‌ తేజ్‌ సరసన ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు. అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం బిగుతైన జడ, లంగా, ఓణీ, తక్కువ మేకప్‌తో విలేజ్‌ గాళ్‌లా మారిపోయారు రకుల్‌. సవాల్‌ అనిపించే పాత్రలు వస్తే సై అంటారు నటీనటులు. వీళ్లందరికీ అలాంటి పాత్రలు వచ్చాయి. వెరైటీ క్యారెక్టర్స్‌లో కనిపించాలనే ఆకలితో ఉన్న వీళ్లందరూ లుక్‌ని మార్చుకోవడమే కాదు.. నటనపరంగా కూడా విజృంభిస్తున్నారు. వీళ్లే కాదు.. ఇలాంటి చాలెంజింగ్‌ రోల్స్‌లో కనిపించనున్న తారలు ఇంకా చాలామందే ఉన్నారు. 

దర్శకుడితో జోడీ


‘మహానటి’తో తనలో ఉత్తమ నటి ఉందని నిరూపించుకున్నారు కీర్తీ సురేశ్‌. తమిళ సినిమా ‘సాని కాయిదమ్‌’లో ఆమె నటన వేరే లెవల్‌లో ఉంటుందని తెలుస్తోంది. ‘7/జి బృందావన కాలనీ’ దర్శకుడు సెల్వరాఘవన్‌ ఈ చిత్రం ద్వారా నటుడిగా మారారు. సెల్వ, కీర్తీ జంటగా తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా ఫస్ట్‌ పోస్టర్‌లో సెల్వ, కీర్తిల లుక్‌ చూసి క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

వృద్ధుని గానూ...

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలవని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుంది? అనే కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ వృద్ధునిగానూ కనిపించనున్నారని సమాచారం. అయితే కొమురం భీమ్‌ చిన్న వయసులోనే మరణించారు. ఇది కాల్పనిక కథ కాబట్టి ఎన్టీఆర్‌కి ఓల్డ్‌ గెటప్‌ కూడా పెట్టి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్‌ ప్రోస్థెటిక్‌ మేకప్‌ వాడుతున్నారని టాక్‌.

90 ఏళ్ల వృద్ధునిగా

వెరైటీ గెటప్పులు వేయడంలో కమల్‌హాసన్‌కి సాటి ఎవరూ రారంటే అతిశయోక్తి కాదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ ‘భారతీయుడు’ (1996). అందులో యువకుడిగానే కాదు.. వృద్ధునిగానూ కమల్‌ కనిపించారు. తాజాగా ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. ఇందులో 90 ఏళ్ల వృద్ధునిగా కమల్‌ కనిపిస్తారని తెలిసింది. హెవీ ప్రోస్థెటిక్‌ మేకప్‌తో కమల్‌ వృద్ధునిగా కనిపించనున్నారు. ఈ వృద్ధునికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. ఆమె 85 ఏళ్ల వృద్ధురాలిగా కనబడతారని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top