Thank You Movie Review And Rating In Telugu | Naga Chaitanya | Rashi Khanna - Sakshi
Sakshi News home page

Thank You Movie Review: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ

Published Fri, Jul 22 2022 11:54 AM

Thank You Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : ‘థాంక్యూ’
నటీనటులు :నాగచైతన్య, రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికా గోర్‌, ప్రకాశ్‌రాజ్‌  సాయి సుశాంత్‌ రెడ్డి
నిర్మాణ సంస్థ : శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ 
నిర్మాతలు: దిల్‌ రాజు, శిరీష్‌
దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌
సంగీతం :తమన్‌
సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్
ఎడిటర్‌: నవీన్‌ నూలి
విడుదల తేది: జులై 22, 2022

పుష్కరకాలం కింద దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన జోష్ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అప్పటి నుంచి నాగచైతన్యతో సినిమాలు చేయలేదు దిల్‌ రాజు. రెండో సారి నాగచైతన్యతో సినిమా తీస్తే అది తప్పకుండా బ్లాక్‌ బస్టర్‌ అయ్యేలా ఉండాలని చాలా కాలంగా వెయిట్‌ చేసి..‘థాంక్యూ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ల‌వ్ స్టోరీ, బంగార్రాజు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత నాగచైతన్య నటిస్తున్న చిత్రం కావడం, అక్కినేని హీరోలకు మనం లాంటి క్లాసిక్ మూవీని అందించిన విక్రమ్‌ కే.కుమార్  ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ‘థాంక్యూ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంపై ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
అభి అలియాస్ అభిరామ్‌(నాగచైతన్య) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ రావ్ క‌న్స‌ల్‌టెన్సీ చీఫ్‌ రావు (ప్రకాశ్‌రాజ్‌) అభికి  ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. కానీ అభికి మాత్రం ఉద్యోగం చేయాలని ఉండడు.  ఓ యాప్‌ని తయారు చేయాలనుకుంటాడు. రావు  గారి ద్వారా పరిచమైన ప్రియ(రాశీఖన్నా)  చేసిన ఆర్థిక సహాయంతో ఓ యాప్‌ని తయారు చేసి సక్సెస్‌ సాధిస్తాడు. దాని ద్వారా అభికి మంచి గుర్తింపు రావడంతో పాటు.. పెద్ద వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఆ తర్వాత అభిలో మార్పు మొదలవుతుంది. తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని పట్టించుకోకుండా.. కేవలం డబ్బు, ప్రతిష్టలకే ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో అందరూ అతనికి దూరం అవుతారు.

చివరకు ప్రేమించిన ప్రియ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు అభి రియలైజ్‌ అవుతాడు. తన మనస్సాక్షితో తాను మాట్లాడుకోవడం మొదలుపెడతాడు. కెరీర్‌ గ్రోత్‌ అంటూ తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని వదిలేశానని.. అందుకే అందరూ తనకు దూరమయ్యారని తెలుసుకుంటాడు. తన తప్పును తెలుసుకొని.. ఈ స్థాయిలో ఉండడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరిని కలిసి థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటాడు. స్కూల్‌, కాలేజీ డేస్‌ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు తన జీవితంలోకి వచ్చిన పారు(మాళవికా నాయర్‌), చిన్నూ(అవికా గోర్‌), శర్వా(సుశాంత్‌ రెడ్డి) కలిసి థ్యాంక్స్‌ చెప్పేందుకై ఇండియాకు వస్తాడు. మరి అభి సక్సెస్‌కు పారు, చిన్నూ, శర్వాల ఎలా కారణమయ్యారు? వీరితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? వీరిని కలిశాక అతనిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు ప్రియ, అభిలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే...
జీవితంలో ఇతరుల సపోర్ట్‌ లేకుండా ఎవ్వరూ సొంతంగా ఎదుగరు. పేరెంట్స్‌..బంధువులు.. స్నేహితులు.. ఇలా ఎవరో ఒకరు మన ఎదుగుదలకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో సహాయం చేస్తుంటారు. మనం ఓ స్థాయికి చేరాక..అలాంటి వారిని మరచిపోవద్దు’అనే మంచి సందేశంతో ‘థాంక్యూ’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌. డైరక్టర్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటీకీ..తెరపై మాత్రం అది అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

గత సినిమాలకు భిన్నంగా కొత్తగా ట్రై చేశాడు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. హీరో తన ఎదుగుదలకు సహకరించిన వారికి ఎమోషనల్‌గా ఎలా థ్యాంక్స్‌ చెప్పాడన్న పాయింట్‌ చుట్టే కథ తిరుగుతుంది. సినిమా మొదలైన కొద్ది సేపటికే.. కథ ఎలా సాగుతుందో, క్లైమాక్స్‌ ఎలా ఉంటుందో సగటు ప్రేక్షకుడు ఊహించుకోవచ్చు. ఎలాంటి ట్విస్ట్‌లు,టర్నింగ్‌ పాయింట్స్‌ లేకుండా సింపుల్‌గా అలా.. సాగిపోతుంది.  

మంచి ఎమోషన్స్‌, సెంటిమెంట్‌తో ఫస్టాఫ్‌ సాగుతుంది. స్కూల్‌ డేస్‌లో పారుతో ప్రేమాయణం, నారాయణపురంలో జరిగే పడవ పోటీల సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ఇష్టంగా ప్రేమించిన పారు ఎందుకు దూరమైందనేది కూడా ఇంట్రెస్టింగ్‌ చూపించారు. ఇంటర్వెల్‌ సీన్‌ సింపుల్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో అభి కాలేజ్‌ డేస్‌ని చూపించారు. అక్కడ కూడా కథ ఊహకు అందేలా సింపుల్‌గా సాగుతుంది. మహేశ్‌బాబు ఫ్లెక్సీ సీన్‌  ఆకట్టుకుంటుంది. 

ఎవరెలా చేశారంటే..
అభిరామ్ పాత్ర‌లో నాగ చైత‌న్య ఒదిగిపోయాడు. ఆయన పాత్రకి చాలా వేరియషన్స్‌ ఉంటాయి. అన్నింటిని చక్కగా డీల్‌ చేశాడు. తెరపై చాలా కొత్తగా కనిపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఒదిగిపోయాడు. కథనంత తన భూజాన వేసుకొని నడిపించాడు.  ఇక ప్రియగా రాశీఖన్నా పర్వాలేదనిపించింది. అయితే ఇందులో ఆమె పాత్రకు నిడివి తక్కువ. ఇక అభి స్కూల్‌డేస్‌ లవర్‌ పార్వతి పాత్రలో మాళవికా నాయర్‌ మంచి నటనను కనబరిచింది.చైతూ- మాళవికా నాయర్‌లా కెమిస్ట్రీ తెరపై వర్కౌట్‌ అయింది. చిన్నూగా అవికా ఘోర్‌ తన పాత్ర పరిధిమేర నటించింది.  ప్రకాశ్‌రాజ్‌  సాయి సుశాంత్‌ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ అందంగా కనిపిస్తుంది.  తమన్‌ సంగీతం జస్ట్‌ ఓకే. టైటిల్‌ సాంగ్‌, కాలేజ్‌ వీడ్కోలు పార్టీ సందర్భంగా వచ్చే పాటలు కొంతమేర ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటర్‌ నవీన్‌ నూలి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement