మురిసే మురిసే... తెర మెరిసే | Sakshi
Sakshi News home page

మురిసే మురిసే... తెర మెరిసే

Published Fri, Dec 8 2023 12:29 AM

Ten New actresses who made their Tollywood debut in 2023 - Sakshi

2023 సిల్వర్‌ స్క్రీన్‌ మురిసేలా చేసింది. మరి.. పదికి పైగా కొత్త తారలు తెరపై మెరిస్తే మురిసిపోవడం సహజం కదా. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ.. ఇలా పలు భాషలకు చెందిన కొత్తమ్మాయిలు ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం.

► ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలప్పర్స్‌’ (2020) వెబ్‌ సిరీస్‌తో నటిగా కెరీర్‌ను డెవలప్‌ చేశారు యంగ్‌ బ్యూటీ వైష్ణవీ చైతన్య. అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’, నాని ‘టక్‌ జగదీష్’, అజిత్‌ ‘వలిమై’ వంటి సినిమాల్లో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేసే అవకాశాలు వచ్చినప్పుడు, అవి తన కెరీర్‌కు సపోర్ట్‌ చేస్తాయని నమ్మి, ఆ పాత్రల్లో నటించారు వైష్ణవి. ఆ నమ్మకమే ఆమెను హీరోయిన్‌ని చేసింది. లీడ్‌ హీరోయిన్‌గా ‘బేబీ’ సినిమా చేశారు వైష్ణవి.

ఈ సినిమాలో ఎంత బాగా నటించారంటే.. ఇప్పుడు ‘బేబీ’ అంటే దాదాపు కుర్రకారు అంతా టక్కున వైష్ణవీ చైతన్య పేరునే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ ‘బేబీ’ సినిమాకు సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించగా, ఎస్‌కేఎన్‌ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. వైష్ణవీ చైతన్య కెరీర్‌ కూడా బ్లాక్‌ బస్టర్‌ అనేలా మారింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ, ఆనంద్‌ దేవరకొండ హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉన్నారీ సిల్వర్‌ స్క్రీన్‌ బేబీ. మామూలుగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని అంటుంటారు. కానీ వరుస సినిమాలతో జోష్‌గా ఉన్నారు వైష్ణవీ చైతన్య. 

► ఈ ఏడాది సూపర్‌ హిట్‌గా నిలిచిన తెలుగు సినిమాల్లో ‘సామజ వరగమన’ ఒకటి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ బ్యూటీ రెబా మోనికా జాన్‌. సాయిధరమ్‌ తేజ్‌ ఓ హీరోగా నటించిన ‘బ్రో’ సినిమా లుక్‌ టెస్ట్‌కు వచ్చిన రెబా మోనికాకి ఆ అవకాశం దక్కలేదు. అదే టైమ్‌లో ‘సామజ వరగమన’ నిర్మాత రాజేశ్‌ దండాను కలవడం, ఆయన ద్వారా రెబాకి చిత్రదర్శకుడు రామ్‌ అబ్బరాజు కథ వినిపించడం, ఆమె ఓకే అనడం, ఈ సినిమా హిట్‌ కావడం అన్నీ చకా చకా జరిగిపోయాయి. నిజానికి ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ విష్ణుతో అంతకు ముందే ఓ సినిమా చేయాల్సిందట రెబా. కానీ ఆ చాన్స్‌ చేజారినప్పటికీ ఫైనల్‌గా శ్రీవిష్ణు ‘సామజ వరగమన’ ద్వారానే టాలీవుడ్‌కి వచ్చారు రెబా.

► తెలుగు తెరపై ఈ ఏడాది మెరిసిన హరియాణా బ్యూటీ యుక్తీ తరేజ. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించారు. 2019లో సూపర్‌ మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పోటీల్లో పాల్గొని నాలుగో స్థానంలో నిలిచి, అందరి చూపూ తనవైపు తిప్పుకున్నారు యుక్తి. ఆ తర్వాత ఇమ్రాన్‌ హష్మితో కలిసి ఈ బ్యూటీ చేసిన ‘లుట్‌ గయే..’ సాంగ్‌ ఇంటర్‌నెట్‌లో సంచలనమైంది. అంతే.. వెండితెర అవకాశాలు వచ్చాయి. అలా ‘రంగబలి’ సినిమాతో తెలుగు తెరపై మెరిశారు యుక్తీ తరేజ. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాగశౌర్య హీరోగా పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి ‘రంగ బలి’ చిత్రాన్ని నిర్మించారు.

► కేరళలో పుట్టి, తమిళనాడులో పెరిగిన అమ్మాయి ఐశ్వర్యా మీనన్‌. తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య యాక్షన్‌ ఫిల్మ్‌ ‘స్పై’తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో చాలా బోల్డ్‌గా కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా చేశారు ఐశ్వర్యా మీనన్‌. ఈ చిత్రంలో నిఖిల్‌ హీరోగా నటించారు. రానా అతిథి పాత్ర చేశారు. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో కె. రాజశేఖరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

► రెండు చిత్రాలతో ఈ ఏడాది తెరపై మెరిశారు సాక్షీ వైద్య. ఈ ముంబై మోడల్‌ నాయికగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఏజెంట్‌’. అఖిల్‌ హీరోగా నటించారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అనిల్‌ సుంకర నిర్మించిన చిత్రం ఇది. అలాగే సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించిన మరో తెలుగు చిత్రం ‘గాంఢీవదారి అర్జున’ కూడా ఈ ఏడాదే రిలీజైంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు.వీరే కాదు.. కిరణ్‌ అబ్బవరం ‘మీటర్‌’ సినిమాతో తమిళ హీరోయిన్‌ అతుల్యా రవి, దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమైన ‘అహింస’తో మధ్యప్రదేశ్‌ అమ్మాయి గీతికా తివారి, బెల్లంకొండ గణేశ్‌ ‘నేను స్టూడెంట్‌ సర్‌!’తో అలనాటి తార భాగ్య శ్రీ తనయ అవంతికలతో పాటు మరికొందరు హీరోయిన్లు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు.

నూపుర్‌ సనన్‌

గాయత్రీ భరద్వాజ్‌

► మ్యూజిక్‌ వీడియోల్లో అక్షయ్‌ కుమార్‌ సరసన నటించి, బాలీవుడ్‌ను ఆకట్టుకున్నారు నూపుర్‌ సనన్‌. అయితే హీరోయిన్‌గా తొలి సినిమాను మాత్రం తెలుగులో చేశారు. రవితేజ టైటిల్‌ రోల్‌ చేసిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో నూపుర్‌ సనన్‌ ఓ హీరోయిన్‌గా నటించారు. అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన ఢిల్లీ అమ్మాయి గాయత్రీ భరద్వాజ్‌కు సైతం తెలుగులో తొలి సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. అన్నట్లు మరో మాట.. మహేశ్‌బాబు, నాగచైతన్య, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన హీరోయిన్‌ కృతీ సనన్‌ సోదరే నూపుర్‌ సనన్‌.

► బాల నటిగా, ఆ తర్వాత సహ నటిగా తమిళ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు అనిఖా సురేంద్రన్‌. గత ఏడాది విడుదలైన నాగార్జున ‘ది ఘెస్ట్‌’ చిత్రంలోనూ ఓ సపోర్టింగ్‌ రోల్‌ చేశారు. బాల నటిగా పేరు తెచ్చుకున్న అనిఖా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన సినిమా ‘బుట్టబోమ్మ’. అర్జున్‌ దాస్, సూర్య వశిష్ట ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘కప్పెలా’కు తెలుగు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు చంద్రశేఖర్‌ టి. రమేశ్‌ దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. 

► కన్నడ పరిశ్రమలో హీరోయిన్‌గా నిరూపించుకున్న ఆషికా రంగనాథ్‌ ‘అమిగోస్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ శాండిల్‌వుడ్‌ బ్యూటీ నటనకు ఆడియన్స్‌ ఓకే అన్నారు. ఆషికా కూడా తెలుగులో మరో అవకాశం తెచ్చుకోగలిగారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగ’లో ఆషిక ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌∙‘అమిగోస్‌’ చిత్రాన్ని నిర్మించారు.

► బుల్లితెర నుంచి తమిళ వెండి తెరపై దర్శనమిచ్చి సక్సెస్‌ ట్రాక్‌లో కొనసాగుతున్న వారిలో ప్రియా భవానీ శంకర్‌ ఒకరు. తమిళంలో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ ‘కళ్యాణం కమనీయం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్‌ నిర్మించింది. జనవరిలో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో ఒకట్రెండు సినిమాలు సైన్‌ చేశారు ప్రియా భవానీ శంకర్‌. 

Advertisement
 
Advertisement