నటనతో అందర్నీ లాక్‌ చేసే సత్యదేవ్‌

Telugu Web Series Review: Locked Its A Thrilling Story - Sakshi

కరోనా దెబ్బతో ఎంటర్‌టైన్‌మెంట్‌ కరువైంది. సినిమాలు, సీరియళ్లు,స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుప్పుడే అవన్నీ తిరిగి ప్రాంభమవుతున్నా.. పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సమయం పట్టనుంది. అలాంటి తరుణంలో ఇళ్లవద్ద ఒకరకంగా క్వారంటైన్‌ పరిస్థితులు అనుభవించిన జనాన్ని ఎంటైర్‌టైన్‌ చేయడానికి మేమున్నామంటూ వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకొచ్చాయి. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లతో మొదటైన వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ తెలుగులోనూ షురూ అయింది. తెలుగు స్ట్రీమింగ్‌ యాప్‌ ‘ఆహా’ వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులకు అలరిస్తోంది. ఈ మధ్య విడుదలై సక్సెస్‌ సాధించిన ‘లాక్డ్‌’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ ఓసారి చూద్దాం!

టైటిల్‌: లాక్డ్‌
నటీనటులు: సత్యరాజ్‌, శ్రీలక్ష్మీ, ఇంటూరి వాసు, అభిరామ్‌ వర్మ, సంయుక్త హొర్నాడు తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్‌ దేవకుమార్‌
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ:నిజాయ్‌ గౌతమ్‌
సంగీతం: ప్రశాంత్‌ శ్రీనివాస్‌
నిర్మాతలు: కేఎస్‌.మధుబాల, హెచ్‌.శణ్ముగ రాజా
జానర్‌: థిల్లర్‌

కథ:
డాక్టర్‌ ఆనంద్‌ చక్రవర్తి (సత్యదేవ్‌) ఓ గొప్ప న్యూరో సర్జన్‌. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎంతో మందిని, అతి సంక్లిష్టమైన ఆపరేషన్లు చేసి రక్షిస్తుంటాడు. తినేందుకు కూడా తీరిక లేకుండా సేవలందిస్తుంటాడు. అయితే, ఓ రోజు రాత్రి పని ముగించుకుని వచ్చిన అతని‌పై ఇంట్లోకి చొరబడ్డ ఓ వ్యక్తి దాడి చేసి పెట్టెలో బంధిస్తాడు. అదే సమయంలో ఆనంద్‌ ఇంట్లో ఇద్దరు మహిళలు పద్మిని బామ్మ (శ్రీలక్ష్మీ), వైష్ణవి (సంయుక్త) దొంగతనం చేసేందుకు వస్తారు. ఆనంద్‌ని బంధించిన ఆ వ్యక్తే ఇంటి యజమాని అని భ్రమపడి మత్తుమందు చల్లి తాళ్లతో కట్టేసి సోఫాలో బంధిస్తారు. లాకర్‌లో ఉన్న డబ్బులు దోచుకుని వెళ్లిపోయే సమయానికి వైష్ణవి మరింత డబ్బు, నగలు ఇంట్లో ఉండొచ్చునని ఓ పెట్టె తెరుస్తుంది. అందులో ఆనంద్‌ ఉండటంతో ఇద్దరు దొంగలు అతని కట్లు విప్పి రక్షిస్తారు. అతనే ఇంటి యజమాని అని తెలియడంతో.. కారు పాడై సాయం కోసం వస్తే.. నీ స్థానంలో ఉన్న వ్యక్తి మాతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే కట్టివేశామని కథ అల్లుతారు. 

అయితే, పోలీసులకు సమాచారం ఇస్తానని, వాళ్లు వచ్చి తనను బంధించిన వ్యక్తి పని చెప్తారని ఆనంద్‌ చెప్పడంతో.. ఆ దొంగలు అక్కడ నుంచి పారేపోయేందుకు యత్నిస్తారు. దీంతో ఇంట్లో చొరబడ్డ వ్యక్తి, దొంగతనం చేసిన ఇద్దరు మహిళలను  ఆనంద్‌ వేర్వేరుగా బంధిస్తాడు. ఈక్రమంలోనే భార్యతో గొడవ కావడంతో ఆనంద్‌ కొలీగ్‌ మిస్బా, మరో పోలీస్‌ అధికారిని వెంటబెట్టుకుని అదే ఇంటికొస్తాడు. మందు పార్టీ చేసుకుంటారు. పార్టీలో పాల్గొంటూనే ఆ ఇంట్లో తాము ముగ్గురం కాకుండా ఇంకెవరో ఉన్నారని  పోలీస్‌ వ్యక్తి అనుమానంగా ఉంటాడు. ఇంటి వెనకాల అతను చూసిన వస్తువులు అతని అనుమానాన్ని మరింత పెంచుతాయి. దాంతోపాటు డాక్టర్‌ ఆనంద్‌ బంధించిన మహిళలు కూడా అతని కంటబడతారు. అయితే, అనూహ్యంగా డాక్టర్‌ ఆనంద్‌ ఆ పోలీస్‌ వ్యక్తిని చంపేయడంతో అసలు కథ మొదలవుతుంది. డాక్టర్‌ ఇంట్లో లాక్‌ అయిన ఆ వ్యక్తులు ఎలా బయటపడ్డారు. అసలు ఆనంద్‌ వెనకున్న మిస్టరీ  ఏంటీ అనేది ప్రధాన కథ.
(చదవండి: అది అదృష్టంగా భావిస్తున్నా)

విశ్లేషణ:
కథలో చాలా భాగం ఒక ఇంట్లోనే జరుగుతుండటంతో స్క్రీన్‌ ప్లే చక్కగా కుదిరింది. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయిందనే చెప్పొచ్చు. నలుగురికి మంచి జరిగేందుకు ఒక్కడు చనిపోతే ఫరవాలేదని కథాంశం. అయితే, ఆ ఒక్కరు ఎవరేనేది ప్రశ్న! ఇక కథానాయకుడు ఆనంద్‌ పాత్రలో సత్యదేవ్‌ చక్కగా నటించాడు. మనసున్న డాక్టర్‌గా, సైకో థ్రిల్లర్గా రెండు కోణాలున్న పాత్రలో ఒదిగిపోయాడు. మొత్తం ఏడు ఏపిసోడ్లుగా ఉన్న ఈ సిరీస్‌లో తొలి మూడు ఎపిసోడ్లు పాత్రల పరిచయంతో సరదాగా సాగిపోగా.. నాలుగో ఎపిసోడ్‌ నుంచి థ్రిలింగ్‌ మొదలవుతుంది. ఇక లాక్డ్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో సక్సెస్‌ అయిందంటే సినిమాటోగ్రఫీ మూలంగానే. దాంతోపాటు సన్నివేశాలకు తగ్గట్టుగా ప్రశాంత్‌ శ్రీనివాస్‌ మ్యూజిక్‌ కంపోజిషన్‌

నటన పరంగా సీనియర్‌ నటి  శ్రీలక్ష్మీ చాలా రోజుల తర్వాత ఓ మంచి, ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించి మెప్పించారు. సంయుక్త, వాసు ఇంటూరి, అభిరామ్‌ వర్మ తమ పరిధి మేరకు నటించారు. ఆపరేషన్లకు సంబంధించి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ కీలకంగా పనిచేసింది. మొత్తంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. అక్కడక్కడా లాజికల్‌గా కొన్ని సీన్లు కన్ఫ్యూజ్‌ చేస్తాయి. ప్రేక్షకులు థ్రిల్‌ను కోరుకున్నప్పటికీ.. మరీ ఎక్కువ సేపు చీకటి వాతావరణకం కొంచెం విసుగ్గా తోచే అవకాశముంది. క్లైమాక్స్‌లో కొంచెం క్లారిటీ మిస్‌ అయినట్టుగా ఉంది. అయితే, ఈ సిరీస్‌కు రెండో పార్ట్‌ కూడా తీసే ఉద్దేశంతో ఫుల్‌ క్లారిటీ ఇవ్వలేదేమో!
(చదవండి: ఇంట్లోనే విడాకుల వాదనలు వకాలత్‌ ఫ్రమ్‌ హోమ్‌)

బలం:
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫీ, సత్యదేవ్‌ నటన

బలహీనతలు
కొన్ని చోట్ల లాజికల్‌గా సెట్‌ కానీ సీన్లు
సిరీస్‌ అధిక భాగం చీకట్లో ఉండటం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top