
జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనేది అవాస్తవం అని..ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ కోరారు. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని చెప్పారు.
‘చర్చలు జరగకపోతే, జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పారు కానీ..దాన్ని కొంతమంది మరోలా ప్రచారం చేశారు. జూన్ 1 నుంచి థియేటర్స్ మూసివేస్తారనే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అలాంటిదేమి జరగడం లేదు. సమస్యలను పరిష్కరించుకోవడానికి మూడు సెక్టర్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నాం.నిర్ణిత సమయంలోగా మా సమస్యలను పరిష్కరించుకుంటాం. 30న ఈసీ సమావేశమై కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం.
థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది.కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్‌లను బంద్ చేస్తున్నామనడం సరికాదు. చిత్ర పరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత రోడ్ మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం’ అని దామోదర ప్రసాద్ అన్నారు.