Know Why TDP Supporters Attacked On Superstar Krishna At Nandyala In 1985 - Sakshi
Sakshi News home page

Super Star Krishna: దాడి జరిగినా లెక్కచేయని సూపర్‌ స్టార్‌ కృష్ణ.. కంటికి కట్టుతో.. 1985లో ఏం జరిగిందంటే?

Published Wed, Nov 16 2022 3:23 PM

TDP Supporters Attacked On Super Star Krishna At Nandyala In 1985 - Sakshi

కర్నూలు కల్చరల్‌: సినీ హీరో సూపర్‌స్టార్‌ కృష్ణకు జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉంది. నంద్యాల సమీపంలోని ఫారెస్ట్‌లో రైల్వే వంతెనపై నిర్వహించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నాడు. 1985లో కృష్ణ కాంగ్రెస్‌ తరపున జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
చదవండి: హార్సిలీ హిల్స్‌తో సూపర్‌స్టార్‌ కృష్ణకు విడదీయరాని అనుబంధం

నంద్యాలలో ఎన్నికల ప్రచారం ముగించుకొని రాత్రి 11 గంటల సమయంలో కర్నూలు చేరుకుంటుండగా నంద్యాల చెక్‌ పోస్ట్‌ సమీపంలో టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. దాడిలో కృష్ణ కంటికి గాయమైంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స చేయించుకొని(కంటికి కట్టుతో) ఎస్టీబీసీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

అర్ధరాత్రి అయినా అభిమానులు ఆయనను చూసేందుకు అలాగే వేచి ఉండటం ఆయన మంచి తనానికి నిదర్శనం. అలాగే బంగారుపేటలో నివాసం ఉండే బాబ్జి.. కృష్ణకు వీరాభిమాని, మంచి మిత్రుడు. ఆయన నివాసానికి విజయ నిర్మలతో కృష్ణ తరచూ వచ్చి పోయేవారు.

ప్రస్తుతం ఆనంద్‌ థియేటర్‌ ఉన్న ప్రాంతంలో బాబ్జి ఏర్పాటు చేసిన రైస్‌మిల్‌ను కృష్ణ దంపతులు ప్రారంభించారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సాయిబాబా థియేటర్‌లో, పండంటి కాపురం నేతాజీ థియేటర్‌లో, పాడిపంటలు విక్టరీ థియేటర్‌లో, ఊరికి మొనగాడు శ్రీరామ థియేటర్‌లో వంద రోజులు ఆడాయి.

అభిమానులు విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహించారు. కృష్ణ అభిమానుల సంఘానికి చెందిన నాయకులు బుధవార పేటకు చెందిన కుమార్, శేఖర్‌లు కృష్ణ సినిమా విడుదలైన ప్రతిసారి చెన్నై, హైదరాబాద్‌ వెళ్లి ఆయనకు కలిసి వచ్చేవారు.

కృష్ణ మృతి పట్ల టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్‌ మి య్యా, ఉపాధ్యక్షులు ఇనాయతుల్లా, ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కార్యాధ్యక్షులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్, కర్నూలు రంగ స్థల కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు బైలుప్పల షఫీ తదితరులు సంతాపం ప్రకటించారు. సినిమా రంగంలో సరికొత్త పోకడలకు నాంది పలికిన మహా నటుడు కృష్ణ అని అభిప్రాయపడ్డారు.   

Advertisement
Advertisement