Tapsee, Anushka Sharma, Janvi Kapoor Hints At New Sports Biopic Movies - Sakshi
Sakshi News home page

తెర మీదే అయినా... తగ్గేదే లే!

Published Fri, Jan 28 2022 12:13 AM

Tapsee, Anushka Sharma, Janvi Kapoor Hints At New Sports Biopic Movies - Sakshi

సినిమాలో ఆటా (డ్యాన్స్‌) పాటా హీరోయిన్లకు కామన్‌. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్‌) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోరు. కెమెరా ముందే అయినా... తగ్గేదే లే! అంటూ విజృంభిస్తారు. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్‌... ఈ ముగ్గురూ వెండితెరపై అసలు సిసలైన క్రికెటర్లు అనిపించుకోవడానికి శిక్షణ తీసుకున్నారు. ఆగేదే లే అంటూ బరిలోకి దిగారు.  ఆ ఆట విశేషాలు తెలుసుకుందాం.

గ్లామర్‌కి చిరునామా అనే తరహా పాత్రలు తాప్సీ చాలానే చేశారు. అయితే చాన్స్‌ వస్తే అందుకు భిన్నమైన పాత్రలు చేయడానికి వెనకాడరు. పింక్, నామ్‌ షబానా, సూర్మ, సాండ్‌ కీ ఆంఖ్, రష్మీ రాకెట్‌ తదితర హిందీ చిత్రాలతో కెరీర్‌ ఇన్నింగ్స్‌ని బ్రహ్మాండంగా తీసుకెళుతున్నారు తాప్సీ. ఇప్పటికే సూర్మ, సాండ్‌ కీ ఆంఖ్, రష్మీ రాకెట్‌ వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నిరూపించుకున్నారు.

ఇప్పుడు ‘శభాష్‌ మిథు’లో క్రికెటర్‌గా తెరపై దూసుకు రావడానికి రెడీ అయ్యారు. భారతీయ ప్రముఖ మహిళా క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్‌ నూషిన్‌ అల్‌ ఖదీర్‌ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు తాప్సీ. ‘‘నిర్భయంగా ఆడే ప్రతి క్రీడాకారుల వెనక ఓ నిర్భయమైన కోచ్‌ ఉంటారు. నాలోని బెస్ట్‌ని బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నూషిన్‌’’ అని గత ఏడాది టీచర్స్‌ డే సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు.

ఇక అచ్చంగా మిథాలీ రాజ్‌లా కనబడటం మీద కాదు కానీ ఆమెలా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టామని కూడా తాప్సీ అన్నారు. ‘‘పోస్టర్‌ షూట్‌కి ముందు నేను మిథాలీ రాజ్‌తో మాట్లాడాను. పోస్టర్‌ చూశాక తనకూ, నాకూ పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించలేదని మిథాలీ అన్నారు. సినిమా చూశాక కూడా ఆమె ఈ మాట అనాలని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు తాప్సీ. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ఈ చిత్రబృందం ప్రకటించింది.

ఇక బాలీవుడ్‌లో ఉన్న మరో గ్లామరస్‌ హీరోయిన్‌ అనుష్కా శర్మ. తాప్సీలానే అనుష్క కూడా చాలెంజింగ్‌ రోల్స్‌ చేస్తుంటారు. ‘ఎన్‌హెచ్‌ 10, పరీ, సూయీ థాగా’ చిత్రాలు అందుకు ఓ ఉదాహరణ. 2017లో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకుని, నటనకు చిన్న బ్రేక్‌ ఇచ్చారు అనుష్కా శర్మ. ఇప్పుడు మళ్లీ నటించాలనుకుంటున్నారు. బ్రేక్‌ తర్వాత ఓ చాలెంజింగ్‌ రోల్‌తో ప్రేక్షకులకు కనిపించనున్నారు. భారత ప్రముఖ మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌లో అనుష్క నటిస్తున్నారు.

‘చక్‌ద ఎక్స్‌ప్రెస్‌’ టైటిల్‌తో ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా కాన్సెప్ట్‌ నచ్చి, ‘ఎన్‌హెచ్‌ 10’, ‘పరీ’లాంటి చిత్రాలను నిర్మించిన అనుష్కా శర్మ ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్‌’ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలామందికి ఓ కనువిప్పు అని అనుష్కా శర్మ చెబుతూ – ‘‘మహిళలు క్రికెట్‌ ఆడటం అనేది పెద్ద విషయంగా అనుకుంటున్న సమయంలో ఝలన్‌ క్రికెటర్‌గా మారి, ప్రపంచ వేదికపై తన దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సినిమా ఆమె జీవితం గురించి మాత్రమే కాదు.. మహిళా క్రికెట్‌ గురించి కూడా చెబుతుంది. క్రికెట్‌ ఆడటం ద్వారా మహిళలకు ఓ మంచి కెరీర్‌ ఉండదనే ఆలోచనా ధోరణిని మార్చేందుకు ఝులన్‌ కృషి చేశారు. భారతదేశంలో మహిళా క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు చేసినందుకు ఝులన్, ఆమె సహచరులకు సెల్యూట్‌ చేయాలి’’ అన్నారు. ఇక.. ప్రాక్టీస్‌ అంటారా? ఇంట్లోనే మంచి క్రికెటర్‌ ఉన్నారు కాబట్టి.. క్రికెటర్‌ పాత్ర కోసం భర్త విరాట్‌ నుంచి అనుష్క టిప్స్‌ అడిగి తెలుసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇటు తాప్సీ సినిమాల పరంగా స్కోర్‌ యాభైకి టచ్‌ అవుతుంటే అటు అనుష్కా శర్మ స్కోర్‌ పాతిక చిత్రాల వరకూ ఉంది. అయితే పట్టుమని పది సినిమాల స్కోర్‌ కూడా లేని జాన్వీ కపూర్‌ కూడా క్రికెట్‌ బ్యాట్‌తో నటిగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్‌ దక్కించుకోవడానికి రెడీ అయ్యారు. దివంగత నటి  శ్రీదేవి కుమార్తె జాన్వీ ‘ధడక్‌’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ‘గుంజన్‌ సక్సేనా’ బయోపిక్‌ని జాన్వీ అంగీకరించడం విశేషం.

1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో ఎయిర్‌ ఫోర్స్‌లో తొలి మహిళా అధికారిగా పాల్గొన్న గుంజన్‌ సక్సేనా పాత్రలో జాన్వీ మెప్పించగలిగారు. ఇప్పుడు క్రికెట్‌ నేపథ్యంలో ఉన్న సినిమా సైన్‌ చేశారు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రాజ్‌కుమార్‌ రావ్, జాన్వీ కపూర్‌ క్రికెటర్లుగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు జాన్వీ. హెల్మెట్‌ పెట్టుకుని ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోను బుధవారం షేర్‌ చేసి, ‘‘క్రికెట్‌ క్యాంప్‌.. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’’ అని పేర్కొన్నారు జాన్వీ. శరన్‌ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 7న విడుదల కానుంది.

‘శభాష్‌ మిథు’, ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ .. చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్‌ మంచి ఆర్టిస్టులే కాబట్టి వెండితెర క్రికెటర్లుగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్‌ దక్కించుకుంటారని చెప్పొచ్చు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement