పెద్ద చిత్రాలు ఆడడం లేదు, చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం లేదని, నిర్మాతలకు పెట్టుబడి కూడా రావడం లేదని, ఓటీటీ సంస్థలు చిత్రాలను కొనుగోలు చేయకపోవడంతో తమిళసినిమా చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ , తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రమణియమ్ పేర్కొన్నారు. ఈయన సినిమాల వసూళ్లు, నిర్మాతల పరిస్థితి, థియేటర్ల కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ల భారం తదితర విషయాలపై వాస్తవాలను చెప్పగలిగిన అనుభజ్ఞుడు. ఆయన ఆదివారం తమిళసినిమా పరిస్థతులపై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ల విషయంలో గత రెండు నెలలుగా సినిమా పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు.
వచ్చే ఏడాది జనవరిలో కొన్ని పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయని, ఆ తరువాత శాసన సభ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. ఆపై భారీ చిత్రాలు లేవని, ముఖ్యంగా చిత్ర నిర్మాణ సంఖ్య తగ్గిపోతోందన్నారు. ఇందుకు కారణం నిర్మాతలు తమ చిత్రాలను వెంటనే ఓటీటీకి ఇవ్వడమేనన్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యం బాధింపులకు గురవుతోందన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోందన్నారు. ఒక చిత్రం విడుదలైన 8 వారాల తరువాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చూడండని ఎంతగా చెబుతున్నా ఎవరూ వినడం లేదన్నారు. యాక్టివ్ నిర్మాతల సంఘంలోని కొందరి మొండితనం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆ నలుగురైదుగురి కారణంగానే సినిమా పరిస్థితి క్లిష్టంగా మారుతోందన్నారు.
అయితే ఇప్పుడు వారి చిత్రాలనే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయని తెలిపారు. ఇతర చిత్ర పరిశ్రమల కంటే తమిళసినిమా పరిస్థితి చాలా దారుణంగా మారుతోందని, ప్రముఖ నటులకు భారీ పారితోషకాలు ఇచ్చే నిర్మాతలు లేరని తెలిపారు. ఎదుగుతున్న నటీనటులు అధిక పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారని, అందువల్ల చాలా మంది నిర్మాతలు ముఖ్య నగరాల్లోనే తమ చిత్రాలను విడుదల చేస్తున్నారని తెలిపారు. చిన్న గ్రామాలకు సినిమాలు రావడం లేదని, థియేటర్లు మూత బడుతున్న పరిస్థితి ఉందన్నారు. అధిక ప్రింట్స్ వేస్తే అధిక ఖర్చు, ఆదాయం రావడం లేదని నిర్మాతలు అంటున్నారని తెలిపారు. ఈ సమస్యలపై చర్చించడానికి మంగళవారం ఆన్‌లైన్ మీటింగ్‌ను నిర్వహిస్తున్నామని డి్రస్టిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియమ్ పేర్కొన్నారు.


