పెళ్లికి వ్యతిరేకిని కాను..!.. త్వరలోనే పిల్లల్ని కనాలనుకుంటున్నా!

Tamannaah Bhatia clarified on Wedding Rumours - Sakshi

పెళ్లెందుకు? మగ తోడు లేకుంటే బతకలేమా? అంతగా కావాలంటే ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇలాంటి మాటలు కొందరు టాప్‌ హీరోయిన్ల నుంచి వింటునే ఉన్నాం. ఉదాహరణకు నటి శృతిహాసన్‌ తీసుకుంటే తాను పెళ్లి చేసుకోను అని ఒక సందర్భంలో ఖరాఖండిగా చెప్పారు. ఆ తరువాత బాయ్‌ఫ్రెండ్‌తో బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు. అయితే అది కూడా జరగలేదు.

ఇక నటి తమన్నా విషయానికొస్తే ఈమె కూడా ఇప్పటి వరకు పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇక నటిగా అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందాల ఆరబోతకు కేరాఫ్‌గా ముద్ర వేసుకున్న తమన్నా ఇటీవల నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈమె అలా నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం బబ్లీ బౌన్సర్‌. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ హిందీ చిత్రం ఆ మధ్య విడుదలై నిరాశనే మిగిల్చింది. అదే విధంగా తెలుగులోనూ హిట్‌ చూసి చాలా కాలమే అయ్యింది.

ఇక తమిళంలో చాలా గ్యాప్‌ తరువాత ఓ చిత్రంలో నటిస్తోంది. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్‌ చిత్రంలో ఈ భామ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది ఈమెకు ఇక్కడ రీ ఎంట్రీ చిత్రమే అని చెప్పాలి. ఒక పక్క అవకాశాలు తగ్గుముఖం పట్టడం, మరోపక్క పెళ్లి వయస్సు కూడా దాటిపోతోందని గ్రహించినట్లు ఉంది.

తాజాగా ఆమె పేర్కొంటూ.. ఇన్నాళ్లూ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల పెళ్లి గురించి ఆలోచించే సమయం లేకపోయిందని, అంతేగానీ పెళ్లికి వ్యతిరేకిని కాదని చెప్పుకొచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు  చెప్పింది. ఈ నేపథ్యంలో కాబోయే జీవిత భాగస్వామిని సెట్‌ చేసుకునే ఉంటుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top