
పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు సుస్మితా సేన్( Sushmita Sen) పరిచయం చేశారు. సరిగ్గా 31 ఏళ క్రితం మే 21న విశ్వసుందరి కిరీటాన్ని ఆమె అందుకున్నారు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో ఆమె పేరు విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోయింది. అప్పటి తీపి గుర్తులను ఆమె తాజాగా మరోసారి గుర్తుచేసుకుంటూ ఫోటలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 'ఈ రోజు నా జీవితంలో ఎప్పిటికీ మరిచిపోలేనిది. నా ఆశలకు మరింత బలాన్ని అందించిన రోజు ఇదే.. ప్రపంచమంతా పర్యటించడానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలిసే భాగ్యం పొందడానికి దోహదపడిన రోజు. మిస్ యూనివర్స్ రేసులో నా భారతదేశం తొలిసారి విజయం సాధించి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యున్నతమైన గౌరవం నాకు అభించిందని ఎప్పటికీ గర్వంగా ఉంటుంది. దానిని మాటలలో చెప్పలేం.' అని ఆమె పంచుకున్నారు.
1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత.. ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందుకుగాను 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషిచేసే వారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది.