Kapatadhaari Review: ట్విస్టులు అదుర్స్‌

Sumanth Kapatadhaari Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : కపటధారి
జానర్ : 
క్రైమ్‌ థ్రిల్లర్‌
నటీనటులు : సుమంత్‌, నందిత, నాజర్‌, జయప్రకాశ్, వెన్నెల కిషోర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : క్రియేటివ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌
నిర్మాతలు : ధనంజయన్‌, లలితా ధనంజయన్‌
దర్శకత్వం : ప్రదీప్‌ కృష్ణమూర్తి 
సంగీతం : సిమన్‌ కె కింగ్‌
సినిమాటోగ్రఫీ : రసమతి
ఎడిటర్‌ : ప్రవీన్‌ కేఎల్‌
విడుదల తేది : ఫిబ్రవరి 19

అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి సుమంత్‌ కృషి చేస్తున్నాడు. హీరోయిజం, మాస్‌ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుస ప్రేమకథా చిత్రాలు చేసి లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న సుమంత్‌.. ఇప్పుడు థ్రిల్లర్‌ కథలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈసారి ‘కపటధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్‌. కన్నడ సూపర్‌ హిట్‌ ‘కవలుధారి’ సినిమాకు ఇది రీమేక్‌. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ వెర్షన్‌ జనవరి 28న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. మరి కన్నడ, తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుమంత్‌కు ఈ సినిమా హిట్‌ అందించిందా? రివ్యూలో చూద్దాం.  

కథ
గౌతమ్‌ (సుమంత్‌) ఒక సిన్సియర్‌ ట్రాఫిక్‌ ఎస్సై. కానీ ఆ జాబ్‌తో అతను సంతృప్తి చెందడు. పోలీసుగా విధుల్లో చేరి క్రైమ్‌ కేసులను విచారించాలని అనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా..పై అధికారులు అతనికి ప్రమోషన్‌ ఇవ్వరు. ఇదిలా ఉంటే.. ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ ముగ్గురి అస్థిపంజరాలు బయటపడతాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పైపైన విచారణ చేసి కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్‌ మాత్రం ఆకేసును సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్‌ గోపాల్‌ కృష్ణ (జయప్రకాశ్), 40 ఏళ్ల క్రితం ఆ కేసును డీల్‌ చేసిన రిటైర్డ్‌ పోలీసు అధికారి రంజన్ ‌(నాజర్‌) పరిచయం అవుతారు. కేసు విచారణలో ఆలేరు శ్రీనివాస్‌ అనే మరోవ్యక్తి పేరు బయటకు వస్తుంది. అసలు ఈ ఆలేరు శ్రీనివాస్‌ ఎవరు? అతనికి ఈ కేసుకు ఏం సంబంధం? మెట్రో తవ్వకాల్లో లభించిన అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లు ఎలా చనిపోయారు? కేసు విచారణలో గౌతమ్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? చివరకి అతను ఈ కేసును ఎలా ఛేదించాడనేది మిగతా కథ.

నటీనటులు
ట్రాఫిక్‌ ఎస్సై గౌతమ్‌ పాత్రలో సుమంత్‌ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎమోషనల్‌ సీన్లను కూడా బాగా పండించాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం నాజర్‌ పాత్ర. రిటైర్డ్‌ పోలీసు అధికారి రంజిత్‌ పాత్రకు ఆయన ప్రాణం పోశాడు. దాదాపు హీరోతో సమానంగా స్ర్కీన్‌ను పంచుకున్నాడు. తన అనుభవం అంతా తెరపై కనబడుతుంది. ఇక జరల్నిస్టుగా జయప్రకాశ్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ రెండు మూడు సీన్లలో కనిపించినా.. తనదైన కామెడీ పంచ్‌లతో నవ్విస్తాడు. హీరోయిన్‌ నందిత, గెస్ట్‌రోల్‌లో కనిపించిన సుమన్ రంగనాథన్, విలన్‌గా చేసిన సతీష్‌ కుమార్‌ తమ పరిధిమేరకు నటించారు.  

విశ్లేషణ
‘కవలుధారి’కి రీమేక్‌గా వచ్చింది ‘కపటధారి’. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా కావడంతో విడుదలైన రెండు భాషల్లోనూ పాజిటివ్‌ టాక్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను బాగానే ఆదరిస్తారు. అదే నమ్మకంతో ప్రదీప్‌ కృష్ణమూర్తి తెలుగులో ఈ మూవీని తెరకెక్కించాడు. అతని నమ్మకం కొంతవరకు వమ్ముకాలేదనే చెప్పాలి. థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు మెండుగా ఉండటం సినిమాకి చాలా ప్లస్‌ అయింది. అయితే, ఈ కథను తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా తీర్చిదిద్దడంలలో దర్శకుడు కొద్దిమేరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు.

దర్శకుడు థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఫీల్‌ని క్రియేట్‌ చేయగలిగాడు కానీ ఎమోషనల్‌ అంశాలను మరిచాడు. ఒరిజినల్ వెర్షన్‌ని మక్కీకి మక్కీ దించేశాడు. అది కొంత మైనస్‌. కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్లు రిపీట్‌ కావడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి  క్రైమ్ తరహా సినిమాలు ఇదివరకే చూశాం కదా అనే ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిమోన్ కె కింగ్ నేపథ్య సంగీతం. తన బీజీయంతో కొన్ని సన్నివేశాలకు అతను ప్రాణం పోశాడు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది అనడం అతిశయోక్తికాదు. ఎడిటర్‌ ప్రవీణ్ కెఎల్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ :
సుమంత్‌, నాజర్‌ నటన
ఇంటర్వెల్‌ ట్విస్ట్‌
సెకండాఫ్‌లోని కొన్ని థ్రిల్లింగ్‌ అంశాలు
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌
స్లో నెరేషన్‌
స్ర్కీన్‌ ప్లే
రొటీన్‌ క్లైమాక్స్
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top