Sarkaru Vaari Paata: పాట కోసం అన్ని లక్షలు ఖర్చుపెట్టాం, కానీ లీక్‌ చేయడంతో బాధేసింది

SS Thaman About Sarkaru Vaari Paata Movie - Sakshi

‘‘నిర్మాతలు, దర్శకులు మనల్ని నమ్మి డబ్బు ఖర్చుపెడుతున్నారు. వారి నమ్మకాన్ని కాపాడుకున్నంత సేపే మన గోల్డెన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు ప్రూవ్‌ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి’’ అన్నారు సంగీతదర్శకుడు తమన్‌. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌ జంటగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ చెప్పిన విశేషాలు.

స్టార్‌ హీరోలతో సినిమాలంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచాలను ఎలా అందుకోవాలా? అని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా స్కూల్‌కు వెళ్లాలనిపిస్తుంటుంది (నవ్వుతూ). ఇప్పుడు మ్యూజిక్‌ ఇవ్వడమే కాదు.. దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం కూడా ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఆడియో కంపెనీలు ఊరికే డబ్బులు ఇన్వెస్ట్‌ చేయవు. ఆదాయం వస్తుందా? లేదా అనే అంశాలను ఆలోచించుకుంటారు. ఒక పాట (‘సర్కారువారి..’లోని ‘కళావతి..’ని ఉద్దేశించి) 150 మిలియన్ల వ్యూస్‌ను దాటడమనేది చిన్న విషయం కాదు. పాన్‌ ఇండియా అనేది సినిమాల విషయంలోనే కాదు.. పాట విషయంలో కూడా జరుగుతోంది. పాట ఎలా ఉండాలి? లిరికల్‌ వీడియోను ఎలా డిజైన్‌ చేయాలి? అనే అంశాలను కూడా ముందే డిజైన్‌ చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. 

అప్పుడు.. అదో టెన్షన్‌ 
ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మంచి మ్యూజిక్‌ చేయడమనేది పాయింట్‌ నెంబర్‌ వన్‌ మాత్రమే. అంచనాలను అందుకోగలడా? ఒత్తిడిని అధిగమించగలడా? అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫ్యాన్స్, హీరోలు, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌.. ఇలా ఎవరైనా సరే మ్యూజిక్‌లో కరెక్షన్స్‌ చెప్పగలుగుతున్న రోజులివి. ఇవి కాక మా లిరికల్‌ వీడియోలు, ఇతర భాషల్లోని లిరికల్‌ వీడియోలు ఒకే రోజు రిలీజైతే అదో టెన్షన్‌. ఉదాహరణకు ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి..’, విజయ్‌ ‘బీస్ట్‌’ చిత్రంలోని ‘అరబిక్‌..’ ఒకే రోజు రిలీజ్‌ అయ్యాయి. హెల్దీ కాంపిటీషన్‌ ఉండాలి. అలాగే ప్రతి సినిమాకు ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. అవి రీచ్‌ కావడం కష్టం అయినా రీచ్‌ కావాల్సిందే.

లవ్‌స్టోరీకి చేయాలని ఉంది 
ఒకప్పుడు ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలే ఉండేవి. ఇప్పుడు స్టోరీ డ్రివెన్‌ సినిమాలను చేస్తున్నాం. దాంతో మ్యూజిక్‌లోని డిఫరెంట్‌ యాంగిల్స్‌ను చూపించే అవకాశం ఉంటుంది. సక్సెస్‌ను హెడ్‌కు లోడ్‌ చేసుకుంటే అప్పుడు మనం ఫెయిల్యూర్స్‌ను తట్టుకోలేం.. పెద్ద సినిమాలే కాదు.. చిన్న సినిమాలకూ సంగీతం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లవ్‌స్టోరీ చిత్రాలకు మ్యూజిక్‌ అందించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

అప్పుడు ‘కళావతి..’ ఉండేది కాదు 
సర్కారువారి పాట’లో టైటిల్‌ సాంగ్‌ నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ పాటకు ఓ పదీ పదిహేను ఆప్షన్స్‌ చేశాం. ఆ తర్వాత ఫైనల్‌ ట్యూన్‌ వచ్చింది. మ్యూజిక్‌ అంటే మ్యూజికల్‌ వెర్షన్‌ ఆఫ్‌ డైలాగ్సే. సినిమాలో ఉన్న డైలాగ్స్‌ను మ్యూజికల్‌గా చెప్పడం అన్నమాట. నాలుగు నిమిషాలు డైలాగ్స్‌ వదిలేసి దర్శకుడు మాకు ఆ టైమ్‌ ఇస్తున్నాడు. మేం కథను సంగీతంతో చెప్పాలి. అది పెద్ద బాధ్యత. ఇప్పుడు కథలో నుంచి వచ్చే పాటలు ఎక్కువయ్యాయి. లేకపోతే ‘కళావతి’ అనే పాట రాదు. జనరల్‌గా మాస్‌ సాంగ్‌కు డాన్స్‌ చేసే ఆడియన్స్‌ రివర్స్‌లో ‘కళావతి..’ పాటకు స్టెప్పులు వేస్తారు. సినిమాలో మహేశ్‌బాబుగారి లవ్‌ని ప్యూర్‌గా చూపించాలని ‘కళావతి..’ పాట రాశాం.

ఈ పాట లిరికల్‌ వీడియో కోసం అదనంగా 30 లక్షలు ఖర్చుపెట్టాం. మా సినిమా నిర్మాతలు మ్యూజిక్‌ను ప్రేమించేవారు కాబట్టి అంత ఖర్చు పెట్టారు. అయితే పాట లీక్‌ కావడం చాలా బాధ అనిపించింది. కరోనా పరిస్థితుల్లో మా నిర్మాతలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ కష్టాల గురించి ఆలోచించకుండా అలా లీక్‌ చేయడం బాధాకరం. లీక్‌ చేసిన వ్యక్తిని పిలిచి ‘నీ కెరీర్‌ గురించి ఆలోచించుకున్నావా? లీక్‌ చేయడం పెద్ద తప్పు’ అని మందలించి పంపాం. ఎందుకంటే అతనికి ఓ కుటుంబం ఉంది. 

సితార రాక్‌స్టార్‌ 
‘పెన్నీ’ సాంగ్‌లో సితారను తీసుకోవాలనిపించి నమ్రతగారిని అడిగాను. మీ హీరోను అడగండి అన్నారు. మహేశ్‌గారిని అడిగాను. ఈ సాంగ్‌లో సితార ఎందుకు? అన్నారు. అప్పుడు సోషల్‌ మీడియాలో సితార డాన్సింగ్‌ వీడియోలు కొన్ని మహేశ్‌గారికి మళ్లీ చూపించి సితార బాడీలో మంచి రిథమ్‌ ఉందని చెప్పాను. ఆ తర్వాత ఓసారి నమ్రతగారితో మాట్లాడుతున్నప్పుడు సితార వచ్చింది. ‘పెన్నీ’ సాంగ్‌లో యాక్ట్‌ చేయడానికి ఇంట్రెస్ట్‌ ఉన్నట్లు చెప్పింది. సితార జస్ట్‌ మూడు గంటల్లో పాట పూర్తి చేసింది. సితార రాక్‌స్టార్‌. ‘పెన్నీ’ సాంగ్‌ ఫైనల్‌ వెర్షన్‌లో సితారను చూసి హ్యాపీ ఫీలయ్యారు మహేశ్‌గారు. ఓ తండ్రిగా ఆయనకు అది ఓ గ్రేట్‌ ఫీలింగ్‌. సితార లిరికల్‌ వీడియోలోనే ఉంటుంది.

ఆడియో సైజ్‌ మారింది
మన సినిమాలు పాన్‌ ఇండియా కాదు.. పాన్‌ వరల్డ్‌ అయ్యాయి. ‘బాహుబలి, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల తర్వాత గ్లోబల్‌ ఆడియన్స్‌ కూడా తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. ‘అల వైకుంఠపురములో..’ తర్వాత ఆడియో సైజే మారిపోయింది. సినిమాలో మేటర్‌ ఉంటేనే ఏమైనా చేయగలం. ‘అఖండ’లో బాలయ్యగారిలో శివుణ్ణి ఊహించుకుని ఆ స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇవ్వగలిగాను.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌
శంకర్‌గారి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా, చిరంజీవిగారి ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం, బాలకృష్ణగారి సినిమా, తమిళ హీరో విజయ్‌తో సినిమా చేస్తున్నాను. హిందీ సినిమాలకు సంగీతం అందించే అవకాశం ఉంది.

చదవండి:  ‘సలాం రాఖీ భాయ్‌’ అంటూ ఐరా ఎంత క్యూట్‌గా పాడిందో!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top