నగ్మాతో సౌరవ్‌ పీకల్లోతు ప్రేమ.. ఆ ఫోటోలు చూసి డోనా ఫైర్‌..బ్రేకప్‌ స్టోరీ

Sourav Ganguly And Nagma Love Breakup Story In Telugu - Sakshi

‘ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు’ అనే జాతీయం తెలుసు కదా! 
అభిమాన క్రికెటర్‌ ఆశించిన ఆటతీరును కనబర్చలేకపోతే ఆ ఆటగాడి స్నేహితురాలో.. ప్రేమికురాలో ఆ నిందను మోయాల్సి వస్తోంది!
క్రికెట్‌ అభిమానుల ఈ ఆగ్రహం సర్వసాధారణమైపోయింది.. 
ఈ రీతికి అనుష్కా శర్మనే కాదు.. అంతకుముందే నటి నగ్మా కూడా బలైంది!!
ఎవరి విషయంలోనో చెప్పేలోపే ఆ వ్యక్తి మీ ఊహకు అందే ఉంటాడు.. సౌరవ్‌ గంగూలీ అని!!

1999.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ రోజులవి.. అప్పుడే కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా సౌరవ్‌కి నగ్మా పరిచయం అయింది. లౌక్యం తెలియని ఆమె ప్రవర్తన అతణ్ణి ఆకట్టుకుంది. నగ్మాకూ అంతే.. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్న సౌరవ్‌ పాపులారిటీ కన్నా అతని స్నేహపూర్వకమైన నడతే నచ్చింది. అన్ని జంటల ప్రయాణంలాగే ఈ జంట ప్రయాణమూ పరిచయం.. స్నేహం మీదుగా ప్రేమ పిచ్‌ చేరుకుంది. ఎప్పటిలాగే మీడియా ఆ కబుర్లను దేశమంతా బట్వాడా చేసింది. ఆ ప్రేమ వ్యవహారంలో పడిపోయి సౌరవ్‌ ఆట మీద దృష్టి పెట్టలేకపోతున్నాడనే విమర్శలనూ వినిపించింది. వరల్డ్‌ కప్‌ చేజారిపోవడానికీ సౌరవ్‌ ఏకాగ్రత లోపమనీ.. దానికి కారణం నగ్మాయేననీ క్రికెట్‌ అభిమానులు.. సౌరవ్‌ వీరాభిమానులూ తీర్మానం చేశారు. సౌరవ్‌ సారథ్యంలోని జట్టు ఎక్కడ ఏ మ్యాచ్‌ ఓడిపోయినా ‘అంతా నీవల్లే.. నీవల్లే’ అంటూ నగ్మాను ట్రోల్‌ చేయసాగారు. 

అన్నిటినీ సహించింది నగ్మా. 
కానీ డోనా భరించలేకపోయింది. ఆ ట్రోలింగ్స్‌ను కాదు.. భర్త ప్రవర్తనను. నగ్మాతో ప్రేమలో పడేటప్పటికే సౌరవ్‌ .. డోనాకు భర్త. ఆమె.. అతని చిన్ననాటి స్నేహితురాలు. మనసిచ్చి.. పుచ్చుకున్న నెచ్చెలి. పెద్దవాళ్లను ఎదిరించి మరీ డోనాను పెళ్లాడాడు. తర్వాత రెండేళ్లకే నగ్మా ఎదురైంది. అతని మనసు గెలుచుకుంది.  తర్వాత కథనంతా మీడియాలో వినింది.. చదివింది.. కనింది డోనా. అవన్నీ రూమర్సే అని తేలిగ్గా తీసుకుంది కూడా.. నగ్మా, సౌరవ్‌ తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నారని.. రహస్యంగా పెళ్లీ చేసుకున్నారనే వార్త వచ్చే వరకూ. వట్టి వార్తగానే వస్తే దాన్నీ పట్టించుకోకపోవునేమో డోనా.. కానీ సౌరవ్, నగ్మా ఇద్దరూ కలసి తిరుమలలో దర్శనానికి వెళ్తున్న ఫొటోతో సహా అచ్చయింది పత్రికల్లో.  

విడాకులకు సిద్ధం..
అందుకే డోనా ఆ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయింది. ఆ రుజువులు చూపిస్తూ సౌరవ్‌ను నిలదీసింది. ‘ఇవన్నీ రూమర్స్‌.. మా మధ్య అలాంటిదేం లేదు అంటూ అదే మీడియాకు స్టేట్‌మెంట్‌ ఇస్తారా? నన్ను విడాకులు ఇమ్మంటారా?’ అని అడిగింది డోనా .. సౌరవ్‌ను. డోనా స్వరంలోని స్థిరత్వానికి భయపడిపోయాడు సౌరవ్‌. చైల్డ్‌హుడ్‌ స్వీట్‌ హార్ట్‌.. హార్ట్‌ బ్రేక్‌ అయిందని అర్థమైంది ఆ భర్తకు. కళ్లనిండా నీళ్లతో ‘క్షమించు’ అని విన్నవించుకున్నాడు. ‘జీవితంలో ఇలాంటి ఆకర్షణలు సాధారణం. అదే సమయంలో స్థిర చిత్తమూ అవసరం’ అని అనునయిస్తున్నట్టుగా సౌరవ్‌ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది డోనా.   

అవన్నీ రూమర్సే..
ఆ తర్వాత మీడియాలో స్టేట్‌మెంట్‌ వచ్చింది.. ‘నగ్మాతో అలాంటిదేం లేదు.. అవన్నీ రూమర్స్‌’ అంటూ. అది సౌరవ్, డోనా ఇద్దరి నుంచీ వెలువడింది. ఇప్పుడు నగ్మా హర్ట్‌ అయింది. మౌనంగా ఏడ్చింది. సౌరవ్‌ మాటకు గౌరవం ఇచ్చి అతని జీవితంలోంచి తప్పుకుంది. ఒంటరిగానే జీవితం కొనసాగిస్తోంది. అయితే.. నగ్మా, సౌరవ్‌ తమ ప్రేమను మీడియా ముఖంగా ఎప్పుడూ నిర్ధారించలేదు. 

‘ఇద్దరికీ సంబంధించిన ఒక వ్యవహారంలో ఒకరికి కెరీర్‌ ప్రధానమైనప్పుడు ఇంకొకరు దాని పర్యవసానాల బరువును మోయాల్సి వస్తుంది. అయినా నాతోనే ఉండాలనే ఈగోకి వెళ్లే బదులు ఆ అనుబంధాన్ని తెంచుకొని బయటకు రావడమే మంచిది. అవతలి వ్యక్తి ఆశయం కోసం మన ఆసక్తి, ఇష్టాలను త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్ల జీవితంలో మన ఉనికి వాళ్లకు సంతోషాన్ని పంచకపోగా నరకాన్ని తలపిస్తుంటే అక్కడి నుంచి మనం తప్పుకోవడమే మేలు’ అని చెప్పింది నగ్మా .. ‘సావి’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో. ఆ మాటలు సౌరవ్‌నుద్దేశించేనని భావించారు ఆమె అభిమానులు. 


- ఎస్సార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top