Skylab Review In Telugu: ‘స్కైలాబ్‌’ మూవీ ఎలా ఉందంటే..?

Skylab Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : స్కైలాబ్‌
నటీనటులు :  సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్‌ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు
నిర్మాణ సంస్థ:  బైట్‌ ప్యూచర్స్, నిత్యామీనన్‌ కంపెనీ 
నిర్మాతలు :  పృథ్వీ పిన్నమరాజు,  నిత్యా మేనన్‌ 
దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు 
సంగీతం : ప్రశాంత్‌ ఆర్‌ విహారి 
సినిమాటోగ్రఫీ :  ఆదిత్య జవ్వాది
ఎడిటింగ్‌:  రవితేజ గిరిజాల
విడుదల తేది : డిసెంబర్‌ 4, 2021

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘స్కైలాబ్‌’.నిత్యామీనన్ హీరోయిన్‌. రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించాడు. 1979లో జరిగిన స్కైలాబ్‌ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై   సినిమాపై ఆసక్తి పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా భారీగా చేయడంతో ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య శనివారం(డిసెంబర్‌ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్కైలాబ్‌’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.  

‘స్కైలాబ్‌’ కథేంటంటే.. 
ఈ సినిమా కథంతా 1979 నాటికాలంలో సాగుతుంది. కరీంనగర్‌ జిల్లా బండలింగంపల్లి గ్రామానికి చెందిన గౌరి(నిత్యామీనన్‌).. జమీందార్ కూతురైనప్పటికీ జర్నలిజంలో తనేంటో నిరూపించుకోవాలనుకుని హైదరాబాద్‌లో ప్రతిబింబం పత్రికలో చేరుతుంది. ఎప్పటికైనా తన పేరుతో వార్త అచ్చువేయించుకుంటానని తండ్రితో సవాల్‌ చేస్తుంది. అయితే తన రాతల వల్ల పత్రికకు ఇబ్బందులు తప్ప లాభమేమిలేదని పత్రిక ఎడిటర్‌ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేస్తాడు. రైటర్‌గా తనను తాను నిరూపించుకోవడానికి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది గౌరి. అదే గ్రామానికి చెందిన డాక్టర్‌ ఆనంద్‌(సత్యదేశ్‌) సస్పెండై సొంతూరికి వచ్చి క్లినిక్‌ పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే తనకు కాస్త స్వార్థం ఎక్కువ. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తాడు. వీరితో పాటు అదేగ్రామానికి చెందిన సుబేదార్‌ రామారావు(రాహుల్‌ రామకృష్ణ) కుటుంబం చేసిన అప్పులు తీర్చడానికి నానా తంటాలు పడుతుంటాడు. వివాదంలో ఉన్న తాత భూమి అమ్మితే చాలు.. అప్పులన్ని తీర్చి హాయిగా బతకొచ్చని భావిస్తాడు. ఇలా వేరు వేరు సమస్యలో సతమతమవుతున్న ఈ ముగ్గురు.. ఒక బ్రేక్‌ కోసం ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో. అమెరికా అంతరిక్ష ప్రయోగశాల నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. అది నేరుగా బండ లింగ‌ప‌ల్లిలోనే ప‌డుతుంద‌నే పుకార్లు వస్తాయి. ఆ సమమంలో గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? స్కైలాబ్‌ నిజంగానే బండలింగంపల్లి గ్రామంలో పడిందా? ఈ సంఘటన కారణంగా గౌరి, డాక్టర్‌ ఆనంద్‌, సుభేదార్‌ జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అనేదే ‘స్కైలాబ్‌’మిగతా కథ. 

ఎవరెలా చేశారంటే...
జర్నలిస్ట్‌ గౌరిగా నిత్య అద్భుతంగా నటించారు. హీరోయిన్‌లా కాకుండా.. గౌరి అనే పాత్రగా మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆమె వాయిస్‌ కూడా సినిమాకు ప్లస్‌ అయింది. ఇక సత్యదేశ్‌, రాహుల్‌ రామకృష్ణ నటనకు వంక పెట్టాల్సిన అవసరంలేదు. నటులుగా వారు ఎప్పుడో నిరూపించుకున్నారు. డాక్టర్‌ ఆనంద్‌గా సత్యదేవ్‌, సుబేదార్‌ రామారావుగా రాహుల్‌ రామకృష్ణ  తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆనంద్‌ తాతయ్య పాత్రలో తనికెళ్ల భరణి, గౌరి తల్లి పాత్రలో తులసి మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. ఇక గౌరి ఇంట్లో పనిచేసే శ్రీను పాత్రలో కొత్త కుర్రాడు విష్ణు బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే.. ?
1979లో సాగే పీరియాడికల్‌ మూవీ ఇది. అప్పట్లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్‌ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్ ఖండేరావు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. అయితే అనుకున్న పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు తెరపై చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కథ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అయితే కథ ఎప్పటికీ ముందుకుసాగదు. కామెడీ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు.

ఇక సెకండాఫ్‌లో అయినా కథలో వేగం పెరుగుతుందనుకుంటే.. అక్కడ కూడా అంతే. స్లోగా సాగుతూ.. బోర్‌ కొట్టిస్తుంది. అయితే క్లైమాక్స్‌ సీన్స్‌, సంభాషణలు బాగున్నాయి. అలాగే అంతర్లీనంగా అప్పట్లో మనషుల మధ్య ఉన్న వివక్షను చూపించే ప్రయత్నం బాగుంది. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా సందర్భానుసారం వస్తాయి. రీ రికార్టింగ్‌ కూడా  ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫికీ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 1979నాటి పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితనం మెచ్చుకోవాలి. ఎడిటర్‌ రవితేజ గిరిజాల తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. ‘స్కైలాబ్‌’ప్రయోగం విఫలమైనా.. ప్రయత్నం మాత్రం బాగుంది.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.25/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top