
రష్మిక- విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నారనే వార్తలు గత కొన్నాళ్లుగా టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అటు విజయ్ కానీ, రష్మిక కానీ నేరుగా స్పందించలేదు. అలా అని ఆ వార్తను ఖండించనూ లేదు. పైగా అప్పుడప్పుడు ఇద్దరు కలిసి పార్టీస్కి, వెకేషన్స్కి వెళ్లడం.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రేమలో ఉన్నది నిజమనే అంతా నమ్ముతున్నారు. వీరిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచేస్తుంది.
తాజాగా రష్మిక డియర్ కామ్రెడ్ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. విజయ్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం రిలీజై ఆరేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా షూటింగ్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..‘ఆరేళ్ల డియర్ కామ్రేడ్.. ఎంతో ప్రేమ, ఆనందం, పాజిటివిటీ నింపిన చిత్రమిది. ఈ ఫోటోలు చాలా ఏళ్ల క్రితం తీసినవి. ఇప్పటికీ నా ముబైల్లో అలాగే దాచుకున్నా. వాటిని తిరిగి చూస్తుంటే.. ఆ మదుర క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మనకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది’ అంటూ రష్మిక విజయ్ దేవరకొండతో పాటు చిత్రబృందంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక, విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని టాలీవుడ్ టాక్.