
'ఆడపిల్లనమ్మా' పాటతో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ.. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాల్లో ఫోక్ సాంగ్స్ పాడుతూ కాస్త బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె తన చెల్లికి దగ్గరుండి నిశ్చితార్థం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చెల్లి-మరిదికి శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా రివ్యూ)
తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడింది.
18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మధుప్రియ.. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన చెల్లి శ్రుతిప్రియకి సుమంత్ పటేల్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయింది. చెల్లికి త్వరలో పెళ్లి కానుండటం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు)

