బాహుబలి సినిమాకు ధీటుగా శింబు మూవీ! | Sakshi
Sakshi News home page

Simbu: రజనీకాంత్‌ కోసం రాసుకున్న కథ.. శింబు దగ్గరకు.. కొత్త లుక్‌లో హీరో!

Published Tue, Dec 19 2023 10:46 AM

Simbu New Avatar For His 48th Film - Sakshi

జయాపజయాలను లెక్క చేయకుండా ముందుకుసాగే హీరోల జాబితాలో శింబు పేరు కచ్చితంగా ఉంటుంది. మానాడు చిత్రం తర్వాత ఈయనకు సరైన హిట్‌ లేదనే చెప్పాలి. వెందు తనిందదు కాడు చిత్రం ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత నటించిన పాత్తుతల చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినా శింబు చిత్రం వస్తుందంటే ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా శింబు తాజాగా తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని నటుడు కమల్‌ హాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనుండటం విశేషం.

రజనీ నుంచి శింబుకు
దీనికి దేశింగు పెరియసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇది ఈయన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కోసం తయారు చేసుకున్న కథ అని సమాచారం. కానీ తర్వాత దీన్ని శింబు దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కోసం శింబు కొత్తగా మేకోవర్‌ అవుతున్నారు. గత కొన్ని నెలల క్రితమే విదేశాలకు వెళ్లి కరాటే, కుంగ్‌ఫూ వంటి ఆత్మ రక్షణ విద్యలో శిక్షణ పొంది వచ్చారు. ఈ చిత్రం కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు.

లుక్కు మార్చేశాడు
బాగా స్లిమ్‌గా తయారవడంతోపాటు పొడవైన జుట్టు, గడ్డం మీసాలతో పూర్తిగా మారిపోయారు. తాజా సమాచారం ప్రకారం ఇది బాహుబలి చిత్రానికి దీటుగా భారీస్థాయి చారిత్రక కథాచిత్రంగా ఉంటుందట. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ చిత్రం గురించి అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.

చదవండి: కొత్త కండీషన్లు పెడుతున్న రైతుబిడ్డ! గర్వం తలకెక్కిందా?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement