ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగులో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలు మరోసారి థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. 4K రీమాస్టర్ వెర్షన్‌లతో పాత క్లాసిక్ సినిమాలు తిరిగి విడుదల అవుతున్నాయి.ఫ్యాన్స్ వీటిని బాగా ఆదరిస్తున్నాయి. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తుండడంతో అందరు హీరోలు ఇప్పుడు ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలన్నీ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రానున్న పక్షం రోజుల్లో అరడజనుకు పైగా చిత్రాలు రీరిలీజ్ అవుతున్నాయి.
‘శివ’తో ప్రారంభం..
నవంబర్ నెలలో కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాలు మినహా మిగతా పెద్ద చిత్రాలేవి రిలీజ్ కావడం లేదు. చిన్న చిత్రాలు బరిలో ఉన్నప్పటికీ వాటిపై బజ్ క్రియేట్ కాలేదు. దీంతో ఈ గ్యాప్‌ని సొమ్ము చేసుకునేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ నిర్మాతలు. వరసగా పాత చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ నెలలో మొదటగా రీరిలీజ్ అవుతున్న చిత్రం ‘శివ’. 36 ఏళ్ల కిత్రం(1989) రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. టాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. నాగార్జున కెరీర్‌లో అతి ముఖ్యమైన ఈ సినిమా.. నవంబర్ 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 4కె ప్రింట్‌తో, డాల్బీ అట్మాస్ సౌండ్ తో రాబోతున్న ఈ కల్ట్ మూవీ.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
‘కొదమసింహం’తో మెగాస్టార్..
‘శివ రిలీజ్ అయిన మరుసటి రోజే.. అంటే నవంబర్ 15న సిద్ధార్థ్-త్రిషల సూపర్ హిట్ చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీలోని పాటలు ఎంత సూపర్ హిట్‌గా నిలిచాయో అందరికి తెలిసిందే. యూత్ టార్గెట్‌గా ఈ మూవీ మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది.
ఇక నవంబర్ 21న మెగాసార్ చిరంజీవి ‘కొదమసింహం’ రీరిలీజ్ కాబోతుంది. . చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు.

వారం గ్యాప్‌లో కోలీవుడ్ బ్రదర్స్
కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తికి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు వారం గ్యాప్‌లో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నారు. కార్తిని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన చిత్రం ‘ఆవారా’. ఈ మూవీ తర్వాత టాలీవుడ్‌లో కార్తి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్స్‌లో సందడ చేయబోతుంది. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వారం రోజుల గ్యాప్ తర్వాత కార్తీ బ్రదర్, కోలీవుడ్ హీరో సూర్య ‘సికిందర్’ చిత్రం రీరిలీజ్ కాబోతుంది.
ఇక నవంబర్ చివరి వారం(నవంబర్ 29)లో మహేశ్ బాబు ‘బిజినెస్ మెన్’ తో మరోసారి థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఒకసారి ఈ చిత్రం రీరిలీజ్ అయింది. అయితే అప్పుడు కొన్ని చోట్ల మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రీరిలీజ్‌కి ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తంగా రానున్న 15 రోజుల్లో అరడజనుకు పైగా సినిమాలు మరోసారి విడుదల కానున్నాయి. వీటీల్లో ఏ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబడుతుందో చూడాలి.


