హైదరాబాద్‌లో భోగి ఆరంభమైంది. అదేంటీ... భోగి పండగ ఈ నెల 14న కదా.. అప్పుడే ఆరంభం కావడం ఏంటి? అని ఆశ్చర్యం కలగడం సహజం. అయితే హైదరాబాద్‌లో ఆరంభమైనది భోగి పండగ కాదు... ‘భోగి’ సినిమా. శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లు.
లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా ‘భోగి’. హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను సోమవారం ప్రారంభించాం.
ఈ కీలక షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నాం. ఈ మూవీలో శర్వా సరికొత్తగా కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కిశోర్ కుమార్.


