
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నారు. తాజాగా ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో ఆయనకు ఈ గౌరవం దక్కింది. మూడు దశాబ్దాలకు పైగా సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా రాణిస్తున్న షారుక్ ఖాన్ ఎన్నో అవార్డ్లను అందుకున్నాడు. కానీ, జాతీయ పురస్కారాల్లో తనకు స్థానం దక్కలేదు. అయితే, తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లోని ‘జవాన్’ సినిమాతో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి విభాగంలో మరో హిందీ నటుడు విక్రాంత్ మెస్సీకీ అవార్డు దక్కింది. ఈ ఆనంద సమయంలో వారిద్దరూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
2023లో విడుదలై జవాన్ చిత్రాన్ని దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఈ చిత్రానికి అవార్డ్ రావడం తనకెంతో సంతోషంగా ఉందని షారుక్( Shah Rukh Khan) చెప్పారు. ' ఎంతో సంతోషంతో ఉన్నాను.. ఈ సమయంలో మాటలు రావడం లేదు. మీరు చూపించే ప్రేమకు ఫిదా అవుతున్నాను. ఈ క్షణం జీవితాంతం గుర్తుంటుంది. ఈ అవార్డ్కు నేను అర్హుడినని గుర్తించిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా జవాన్ సినిమా టీమ్కు ఎంతో రుణపడి ఉన్నాను. జవాన్ సినిమాను ఎంతగానో నమ్మి దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. షూటింగ్ సమయంలోనే అవార్డ్ తెచ్చిపెట్టే సినిమా అంటూ చెప్పేవారు.
నా టీమ్ వల్లే ఈ అవార్డ్ దక్కింది అనుకుంటున్నాను. నా కోసం వారు ఎంతగానో కష్టపడుతుంటారు. ఒక్కోసారి నేను అసహనం చెందినా కూడా వారు భరిస్తారు. అందుకే ఈ అవార్డ్ రావడం వెనుక ప్రధాన కారణం వారేనని చెప్తాను. ఇన్నేళ్ల పాటు సినిమా పరిశ్రమలో ఉండేందుకు ముఖ్య కారణం నా కుటుంబం. ఒక్కోసారి నా భార్యతో పాటు పిల్లలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. అయినప్పటికీ వారు చిరునవ్వుతోనే నా కోసం భరిస్తారు. జాతీయ అవార్డ్ మరింత బాధ్యతను గుర్తుచేస్తుంది. అభిమానుల కోసం మరిన్ని మంచి సినిమాలతో పలకరిస్తాను' అని షారుక్ అన్నారు.
20 ఏళ్ల కల నిజం అయింది
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన స్ఫూర్తిదాయకమైన బయోగ్రాఫికల్ చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’లో ఇందులో హీరోగా నటించారు విక్రాంత్ మెస్సీ( Vikrant Massey). విధు వినోద్ చోప్రాదర్శకత్వంలోని ఈ ‘ట్వెల్త్ ఫెయిల్’ ఉత్తమ చిత్రంగానూ అవార్డు కొల్లగొట్టింది. ఉత్తమ నటుడి విభాగంలో విక్రాంత్ మెస్సీ అవార్డ్ అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇలా అన్నారు. షారుక్‌తో కలిసి ఈ అవార్డును పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. తన 20 ఏళ్ల కలను నిజం చేసిన చిత్ర యూనిట్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. షారుక్ వంటి గొప్ప స్టార్తో తొలి జాతీయ అవార్డును పంచుకోవడం తనకి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.