Shaakuntalam Review: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ

Shaakuntalam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: శాకుంతలం
నటీనటులు: సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్‌, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి, అల్లు అర్హ తదితరులు
నిర్మాణ సంస్థ: గుణ టీమ్‌వర్స్స్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌
నిర్మాతలు : నీలిమా గుణ
దర్శకత్వం: గుణశేఖర్‌ 
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ:  శేఖర్‌ వి.జోసెఫ్‌
ఎడిటర్‌ : ప్రవీణ్‌ పూడి 
విడుదల తేది: ఏప్రిల్‌ 14, 2023

కథేంటంటే..
విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సుని భంగం చేయమని మేనక(మధుబాల)ను భూలోకానికి పంపిస్తాడు ఇంద్రుడు. అనుకున్నట్లే తన అందచందాలతో మేనక.. విశ్వామిత్రుని తప్పస్సుకి భంగం కలిగిస్తుంది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగాను కలుస్తారు. ఫలితంగా మేనక ఓ ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఓ మనిషి వల్ల పుట్టిన బిడ్డకి దేవలోకంలో ప్రవేశం లేకపోవడంతో ఆ చిన్నారిని భూలోకంలోనే వదిలి వెళ్లిపోతుంది మేనక. ఆ చిన్నారిని ఓ పక్షుల గుంపు మాలినీ నది తీరాన ఉన్న కణ్వ మహర్షి(సచిన్‌ ఖడేకర్‌) ఆశ్రమానికి తరలిస్తాయి.

ఆమెకు శకుంతల(సమంత) అని పేరుపెట్టి కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు కణ్వ మహర్షి. ఒకరోజు దుష్యంత మహారాజు(దేవ్‌ మోహన్‌) కణ్వాశ్రమానికి వెళ్తాడు. అక్కడ శకుంతలను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. శకుంతల కూడా దుష్యంత మహారాజుని ప్రేమిస్తుంది. గాంధర్వ వివాహంతో ఇద్దరూ ఒక్కటవుతారు.  ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవేంటి? గర్భిణీగా ఉన్న శకుంతలకు దుష్యంత రాజ్యంలో జరిగిన అవమానం ఏంటి? శకుంతల గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రి కాదని దుష్యంతుడు ఎందుకు చెప్పాడు? శకుంతల, దుష్యంతుడు విడిపోవడానికి దుర్వాస మహాముని(మోహన్‌ బాబు) ఎలా కారణమయ్యాడు? గర్భవతిగా ఉన్న సమయంలో శకుంతల పడిన బాధలేంటి? ఆమెకు పుట్టిన బిడ్డ ఎక్కడ పెరిగాడు? తిరిగి వీరిద్దరు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గుణశేఖర్‌. ఇదొక అందమైన ప్రేమ కావ్యమని అందరికి తెలిసిందే. చాలామందికి తెలిసిన కథ.  ఇలాంటి కథలకు తెరరూపం ఇవ్వడం అంటే కత్తిమీద సాములాంటిదే. ప్రేక్షకులను మైమరిపించేలా విజువల్‌ ఎఫెక్స్‌, గ్రాఫిక్స్‌ ఉండాలి. కానీ ఈ విషయంలో గుణశేఖర్‌ టీమ్‌ దారుణంగా ఫేలయింది. నాసిరకమైన త్రీడీ హంగులతో సీరియల్‌కి ఎక్కువ సినిమాకు తక్కువ అన్నట్లుగా శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించారు.  

అయితే ఇప్పటికీ మహాభారతం చదవకపోయినా.. శకుంతల అంటే ఎవరో తెలియకపోయినా..ఈ సినిమా అర్థమవుతుంది. ఒక్కో విషయాన్ని చాలా నీట్‌గా, అందరికి అర్థమయ్యేలా వివరించారు. అయితే కథను కథలాగే చెప్పడం మైనస్‌. 

ఈ రోజుల్లో కథలో వేగం, బలమైన సంఘర్షణలు, ట్విస్టులు లేకపోతే.. ప్రేక్షకులు ఆదరించడం లేదు. వారిని రెండున్నర గంటలు ఎంటర్‌టైన్‌ చేయడానికి బలమైన కథ ఉండాలి. లేదంటే మైమరిపించేలేలా సాంకేతిక హంగులద్దాలి. కానీ ఈ రెండూ శాకుంతలంలో మిస్‌ అయ్యాయి. కథ ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా అలా.. వెళ్తుంది. కానీ ప్రేక్షకుడికి బోర్‌ కొడుతుంది. ఆహా..ఓహో..అనిపించేలా ఒక్కటంటే.. ఒక్క సన్నివేశం ఉండదు. 

ఫస్టాఫ్‌ మొత్తం విషయానికిస్తే.. పసిపాప శకుంతలను పక్షులు ఎత్తుకెళ్లి కణ్వాశ్రమంలో వదిలేయడం.. కణ్వ మహర్షి పెంచి పెద్ద చేయడం.. అక్కడి పక్షులు, జంతువులతో శకుంతలకు ఉన్న అనుబంధం.. దుష్యంతుడితో ప్రేమాయణం.. ఇలా సాగుతుంది. ఒక చిన్న ట్వీస్ట్‌తో ఇంటర్వెల్‌ కార్డు పడుతుంది. 

అసలు కథంతా సెకండాఫ్‌లో సాగుతుంది. దుష్యంతుడి రాజ్యానికి శకుంతల వెళ్లడం.. ఆమెకు అవమానం జరగడం.. రాజ్యంలోని మనుషులు రాళ్లతో కొట్టడం..ఆమె అక్కడి నుంచి పారిపోవడం..ఇలా చాలా సంఘటనలు సెకండాఫ్‌లో జరుగుతాయి. ఫస్టాఫ్‌లో పోలిస్తే సెకండాఫ్‌ కాస్త బెటర్‌.

శకుంతల, దుష్యంతుడు లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోదు. అలాగే వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ పండేందుకు బలమైన సీన్స్‌ కూడా ఉండవు.  యుద్ధ సన్నివేశాలు సైతం అంత్యంత పేలవంగా సాగుతాయి. చాలా చోట్ల ఇది గ్రాఫిక్స్‌ అనే విషయం ఈజీగా తెలిసిపోతాయి. ఇక క్లైమాక్స్‌లో భరతుడిగా అల్లు అర్హ ఎంట్రీ అదిరిపోతుంది. దుష్యంతుడితో ఆమె చేసే వాదనలు ప్రేక్షకులను అలరిస్తాయి. 

ఎవరెలా చేశారంటే..
శకుంతల పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది సమంత. ప్రేమికురాలిగా, భర్తకు దూరమైన భార్యగా ఇలా డిఫెరెంట్‌ వేరియషన్స్‌ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించింది. కానీ ఆమె డబ్బింగ్‌ మాత్రం పెద్ద మైనస్‌. ఇక దుష్యంత మహారాజుగా దేవ్‌ మోహన్‌ బాగానే సెట్‌ అయ్యాడు కానీ.. నటన పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయన స్థానంలో టాలీవుడ్‌కి పరిచయం ఉన్న నటుడిని తీసుకుంటే బాగుండేమో. ఓ స్టార్‌ హీరోని పెడితే ఇంకా బాగుండేది. ఎందుకంటే సమంతతో సమానంగా ఆ పాత్రకు స్క్రీన్‌ స్పేస్‌ ఉంది. అలాంటి పాత్రకు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని దేవ్‌ మోహన్‌ని ఎంచుకొని గుణ శేఖర్‌ పప్పులో కాలేశాడు.

ఇక దుర్వాస మహర్షిగా మోహన్‌ బాబు బాగా సెట్‌ అయ్యాడు. ఆయన తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆకట్టుకున్నాడు. మేనకగా మధుబాలను చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అర్హ.. తన ముద్దు ముద్దు మాటలతో భరతుడి పాత్రకు న్యాయం చేసింది. తెలుగు డైలాగ్స్‌కి చక్కగా చెప్పింది. గౌతమి, అనన్యా నాగళ్ళ, జిష్షుసేన్ గుప్తా, శివ బాలాజీ, కబీర్ సింగ్, సచిన్ ఖడేకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.  ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్‌ పూర్తిగా తేలిపోయింది. త్రీడీ అన్నారు కానీ.. ఆ ఫీలింగ్‌ పెద్దగా కలగదు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top