
డ్యాన్సర్ నుంచి హీరోయిన్‌గా మారినవారిలో రాజసులోచన (Rajasulochana) ఒకరు. 1953లో గుణసోదరి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 325కి పైగా సినిమాలు చేశారు. ప్రతి భాషలో తనకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రాజసులోచన గురించి ఆమె కూతురు శ్రీ గురుస్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.
చిన్న వయసులో మొదటి పెళ్లి
అమ్మ నటి, డ్యాన్సర్, సామాజిక కార్యకర్త. నాన్న (చిత్తజల్లు శ్రీనివాసరావు) గొప్ప దర్శకుడు. అమ్మది విజయవాడ, నాన్నది కాకినాడ. సినిమా ఇండస్ట్రీకి వచ్చాకే వీరు కలుసుకున్నారు. అమ్మకు చిన్న వయసులోనే పెళ్లయింది. చెన్నైలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అమ్మను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు సంతానం. తర్వాత కష్టాలు మొదలవడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం అమ్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయింది. ఇక్కడే నాన్నగారు తనకు పరిచయమయ్యాడు.
చివరి రోజుల్లో విడివిడిగా..
1964లో నాన్నను రెండో పెళ్లి చేసుకుంది. రెండేళ్లకే మేము(కవలలు) పుట్టాం. అమ్మానాన్న ఫుల్ బిజీ కావడంతో మేము అమ్మమ్మ దగ్గరే పెరిగాం. తర్వాత నా సోదరి ఇండియాలో సెటిలైతే నేను అమెరికాలో సెటిలయ్యాను. ప్రతి ఏడాది అమ్మ నా దగ్గరకు వస్తూ ఉండేది. అయితే చివరి రోజుల్లో అమ్మ.. నాన్నకు దూరంగా ఉంది. నాన్నకు ఉన్న చెడు అలవాట్లు అమ్మకు నచ్చక విడిగా ఉండేది. ఆ బాధకు తోడు హైబీపీ వల్ల కిడ్నీ ఫెయిలైంది. అయితే చాలామంది సినిమాలు తీసి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. కానీ, అమ్మానాన్న ఇల్లు, ప్లాట్స్‌పై ఇన్వెస్ట్ చేశారు అని చెప్పుకొచ్చింది. రాజసులోచన.. వాల్మీకి, శాంతినివాసం, బాలనాగమ్మ, పాండవ వనవాసం, పెంకి పెళ్లాం.. ఇలా అనేక సినిమాలు చేశారు. 2013లో కన్నుమూశారు.
చదవండి: లారెన్స్‌ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనంటూనే..'