
సత్యదేవ్.. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సహాయ నటుడి పాత్రలతో కూడా అలరిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇటీవల విడుదలైన మంచి టాక్ని సంపాదించుకుంది. విజయ్ తో పాటు సత్యదేవ్ పోషించిన పాత్రకు కూడా మంచి స్పందన లభిస్తోంది. సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ఒక హీరోనే అని చాలా మంది అంటున్నారు.
హీరో అన్నయ్య శివ పాత్రలో ఆయన ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉందని చెబుతున్నారు. పాత్ర నచ్చడంతోనే ఆ సినిమాకు ఒప్పుకున్నానని అంటున్నాడు సత్యదేవ్. ఈ సినిమా కంటే ముందు చాలా సినిమాల్లో సహాయ నటుడి పాత్రలు వచ్చాయి కానీ నచ్చకపోవడంతో నో చెప్పానని అన్నారు. డబ్బుల కోసం ఎప్పుడు సినిమాలు చేయనని.. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటానని సత్యదేవ్ అంటున్నాను.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘డబ్బు కోసం అయితే నేను సినిమాలు చేయలేను. గాడ్ ఫాదర్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. అలాంటి పాత్రలు చేయమని చాలా మంది అడిగారు. కానీ పాత్ర నచ్చక చేయలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను డబ్బు కోసం సినిమా చేయలేదు. మంచి పాత్రల కోసం ఎదురు చూశా. అందుకే ఇప్పుడు శివ లాంటి పాత్రలు దొరికాయి. డబ్బు కోసం సినిమా చేయొద్దని స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యాను. ఒకవేళ డబ్బులే కావాలనుకుంటే ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటాను. అంతేకాని నచ్చని పాత్రలు అయితే చేయను’ అని సత్యదేవ్ అన్నారు.