'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్‌ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్! | Sandeep Reddy Vanga Advised Kiran Rao To Go See Aamir Khan Dil Movie After She Calls Animal Misogynistic - Sakshi
Sakshi News home page

Sandeep Reddy Vanga: 'మీ భర్త సినిమాలో జరిగింది చూశారా?'.. స్టార్ ‍హీరో మాజీ భార్యకు కౌంటర్!

Published Fri, Feb 2 2024 9:05 PM

Sandeep Reddy Vanga advised Kiran Rao to go see Aamir Khan Dil Movie - Sakshi

ఇటీవలే యానిమల్‌ మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం  స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. 

అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్‌ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. 

సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్‌ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement