Salman Khan: చిరంజీవిగారు అడగ్గానే ఓకే చెప్పా!

Salman Khan visits Hyderabad to promote Antim - Sakshi

‘‘చిరంజీవిగారు, రామ్‌చరణ్‌లు నాకు మంచి స్నేహితులు. వెంకటేశ్‌గారు కూడా బాగా తెలుసు. నేను నేరుగా తెలుగులో నటిస్తున్నాను. ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో చేయమని చిరంజీవిగారు అడిగారు. పాత్ర ఏంటి? ఎన్ని రోజులు షూటింగ్‌ అని అడగకుండా సరే అన్నాను. వెంకటేశ్‌గారితో కూడా నటించబోతున్నాను’’ అని బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అన్నారు. మహేశ్‌ వి. మంజ్రేకర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, ఆయుష్‌ శర్మ హీరోలుగా నటించిన హిందీ చిత్రం ‘అంతిమ్‌’. సల్మాన్‌ ఖాన్‌ నిర్మించిన ఈ సినిమా నవంబరు 26న విడుదలైంది.

బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం థ్యాంక్స్‌ మీట్‌లో సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘నా సినిమా రిలీజ్‌కు ముందే ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్స్‌ చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంటాను. ‘టైగర్‌ 3’ షూటింగ్‌ వల్ల ఈసారి టైమ్‌ కుదరలేదు. ‘అంతిమ్‌’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌లో బాగా ఆదరిస్తున్న నా ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పేందుకే వచ్చాను. నా ‘దబాంగ్‌’ సినిమాను తెలుగులో డబ్‌ చేసి, విడుదల చేశాం. కోవిడ్‌ వల్ల  ‘అంతిమ్‌’కు టైమ్‌ లేక తెలుగులో డబ్‌ చేయలేదు. నా తదుపరి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుదల చేస్తాను.

మాస్, క్లాస్, మల్టీప్లెక్స్, సింగిల్‌ స్క్రీన్‌.. ఇలా ప్రత్యేకించి ఏ తరహా చిత్రాల్లో నటించాలని ఆలోచించను.. కథ నచ్చితే సినిమాలు చేస్తానంతే. సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తే లాభాలకు గ్యారెంటీ ఉంటుంది. థియేటర్‌లో సినిమా సరిగ్గా ఆడకుంటే డబ్బులు రావు.. ఇది ఓ రకంగా రిస్క్‌. అయినా థియేటర్‌ అనుభూతే వేరు. చాన్స్‌ వస్తే ఓటీటీకి చేస్తాను’’ అన్నారు. మహేశ్‌ వి.మంజ్రేకర్, ఆయుష్‌ శర్మ కూడా పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top