షూటింగ్స్‌కి స్టార్‌ హీరోలు రెడీయా? | Sakshi
Sakshi News home page

షూటింగ్స్‌ చేయాలా? వద్దా?

Published Fri, Aug 28 2020 12:51 AM

sakshi special story about movie shootings in tollywood film industry - Sakshi

షూటింగ్స్‌ చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. కొన్ని గైడ్‌లైన్స్‌ సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రైట్‌ రైట్‌ అంది. చిన్న చిన్నగా చిన్న సినిమాలు ప్రారంభమయ్యాయి. మరి భారీ సినిమాల సంగతేంటి? షూటింగ్స్‌కి స్టార్‌ హీరోలు రెడీయా? కరోనా తగ్గేవరకూ నో కాల్షీట్‌.. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ నో క్యారవ్యాన్‌... అంటున్నారా? లేదా రంగంలోకి దిగేద్దాం. షూటింగ్‌ చేసేద్దాం అంటున్నారా? పెద్ద బడ్జెట్‌ సినిమాలు ప్రారంభించడానికి నిర్మాతలు సిద్ధమా? ప్రస్తుతం చిత్రీకరణల గురించి ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు? ఇదే విషయాలను పలువురు నిర్మాతలను అడిగాం. వాళ్లు ఈ విధంగా చెప్పారు. ఆ విశేషాలు.

షూటింగ్‌లు చేయాల్సిందే

– దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
ప్రస్తుతం షూటింగ్‌లు చేసేవాళ్లు చేస్తున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి. ఇప్పటికే కార్మికులు ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. కరోనా అనేది రెండు నెలలో, మూడు నెలలో అనుకుంటే షూటింగ్‌లైనా, మిగతా పనులైనా ఆపి కూర్చోవచ్చు. కరోనా మరో రెండు, మూడేళ్లు ఖచ్చితంగా ఉంటుంది. అప్పటివరకు పనులు చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎలా గడుస్తుంది? అందుకని షూటింగ్‌ చేయటం అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ  కరోనా వస్తుందనుకొని ప్రిపేర్‌ అయ్యి షూటింగ్‌లు చేసుకోవాల్సిందే.

అప్పుడే వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు చాలా బ్యాడ్‌ పొజిషన్‌లో ఉన్నారు. కష్టాల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా వర్క్‌ చేయాల్సిందే. ఒకవేళ ఎవరికైనా షూటింగ్‌లో పాల్గొన్నపుడు కరోనా వస్తే భయపడకుండా ఆ రిస్క్‌ను తీసుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే. తప్పదు మరి. కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే బడా నిర్మాతలు, హీరోలు ఇప్పట్లో షూటింగ్‌లు చేయకపోయినా పర్లేదు. మధ్యస్తంగా ఉండేవారు తప్పనిసరిగా షూటింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది.

ప్రస్తుతం షూటింగ్‌ అంటే రిస్కే

– ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత పి. రామ్మోహన్‌రావు
రెండు నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లు చేసుకోవచ్చని పర్మిషన్‌ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్‌ ఇవ్వటంలో కొత్త పాయింటేం లేదు. ఏదేమైనా షూటింగ్‌లలో పాల్గొనటమా? లేదా అనేదే ఇక్కడ ప్రశ్న? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొనటం లైఫ్‌ రిస్కే. కానీ రిస్క్‌ అయినా çఫర్వాలేదు షూటింగ్‌ చేద్దాం అనుకునేవాళ్లు చేస్తున్నారు. వారి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. కాకపోతే పెద్ద నటీనటులెవరూ షూటింగుల్లో పాల్గొనటం లేదు.

ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం. నేను, సునీల్‌ నారంగ్‌ నిర్మిస్తోన్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్‌ 7 నుండి చేయటానికి ప్లాన్‌ చేస్తున్నాం. హీరో నాగచైతన్య, దర్శకుడు శేఖర్‌ కమ్ముల షూటింగ్‌ చేయడానికి ముందుకొచ్చారు. కేవలం 15మందితో ఈ షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. వారందరికీ మొదట కరోనా టెస్టులు చేయిస్తాం. అలాగే షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ఎవరూ ఇంటికి వెళ్లం. అందరికీ లొకేషన్‌ దగ్గరే బస ఏర్పాటు చేయబోతున్నాం.

షూటింగ్‌కి తొందరపడటంలేదు

– పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి వివేక్‌ కూచిభొట్ల
మేం ప్రస్తుతానికి చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్‌ పనులు చేస్తున్నాం. ఎక్కువ క్రౌడ్‌ ఉండే సినిమాల షూటింగ్‌ చేయదలచుకోలేదు. ప్రస్తుతం పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమాలు చేస్తున్నాం. కార్తికేయతో ఓ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా చిత్రీకరణ ఫారిన్‌లో జరపాలి. ప్రస్తుతానికి షూటింగ్స్‌ చేయడంలేదు. థియేటర్స్‌ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అందుకే రిలీజ్‌ డేట్స్‌ కూడా ఫిక్స్‌ చేసుకోలేం. దాని వల్ల తొందరపడి షూటింగ్స్‌ స్టార్ట్‌ చేయాలని కూడా అనుకోవడం లేదు. కొన్ని రోజుల్లో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. అది కూడా సీన్లో ఎక్కువ మంది జనం లేని సన్నివేశాలే ముందు షూట్‌ చేస్తాం’’ అన్నారు.

ధైర్యం ఉన్నోళ్లు చేసుకోవచ్చు

– నిర్మాత డి. సురేశ్‌బాబు
ప్రభుత్వం షూటింగ్‌లు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే కొంతమంది షూటింగ్‌లు చేసుకుంటున్నారు కూడా. కానీ మా బ్యానర్‌లో తీసే సినిమాల షూటింగ్‌లు చేయటానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుంది. నా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆరోగ్య భద్రత ఎంతో ముఖ్యం. అది నేనివ్వగలనని గ్యారంటీ లేదు. మా బేనర్‌లో తీస్తున్న ఓ సినిమాకి 27 రోజుల షూటింగ్‌ మిగిలి ఉంది. అవన్నీ యాక్షన్‌ సీక్వెన్స్‌లే. ప్రతి సీన్‌లో దాదాపు 50 నుంచి 100 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో పాటు మెయిన్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అందరూ కలిపితే 150మంది వరకు అవుతారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతమందిని కాపాడగలమని నమ్మకం లేదు. రోడ్‌ మీదకి వెళ్లినప్పుడు మాస్క్‌ వేసుకుని వెళ్లాలని చెప్తే దాన్ని కూడా కొంతమంది సరిగ్గా  ఆచరించటం లేదు. దాదాపు 30 శాతం మంది మాస్క్‌ పెట్టుకోమంటే అదేదో తప్పులా ఫీలవుతున్నారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు నేను త్వరత్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకుని ఎక్కడ విడుదల చేయాలి? నేను వ్యక్తిగతంగా నా ఫ్యామిలీతో కానీ స్నేహితులతో కానీ సినిమా థియేటర్‌కి వెళ్లి ఇప్పట్లో సినిమా చూడను. కారణం ఏంటంటే క్లోజ్డ్‌ ఏసీ థియేటర్లలో ముక్కుకి, మూతికి మాస్క్‌ పెట్టుకుని నవ్వొస్తే నవ్వకుండా సినిమా ఫీల్‌ను ఎంజాయ్‌ చేయలేను. ఉపాధి కోసం షూటింగ్‌ చేయటం మంచిదే కానీ దాన్ని ఎవరు ఏ విధంగా హ్యాండిల్‌ చేస్తారనేది ఇక్కడ పాయింట్‌.

ఉదాహరణకు టీవీ వాళ్లు ఉన్నారు. వాళ్లు ఈ రోజు షూటింగ్‌ చేసి ఆ కంటెంట్‌ను అమ్మితే ఓ యాభైవేల రూపాయలు లాభం వస్తుంది అనే గ్యారంటీ ఉంటుంది కాబట్టి వాళ్లు చేయొచ్చు. సినిమావాళ్లకి ఆ గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఉపాధి కోసమే కదా బాలూ (ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం)గారు షూటింగ్‌ చేసింది. ఆయన పరిస్థితేంటి? లక్కీగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనకు, సినిమా పరిశ్రమకు ఎంత నష్టం జరిగేది. షూటింగ్‌ చేయటం, చేయకపోవటం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కొంతమందికి చాలా ధైర్యం ఉంటుంది. వాళ్లు చేసుకోవచ్చు. నాలాంటి వాళ్లకు ధైర్యం ఉండదు. పరిస్థితులన్నీ నార్మల్‌ అయ్యాక, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే షూటింగ్స్‌ మొదలుపెడతాను.

Advertisement
Advertisement