Sai Pallavi Birthday Special: Sai Pallavi Interesting Facts, Family, Movies, Biography - Sakshi
Sakshi News home page

Happy Birthday Sai Pallavi: ఆ రికార్డులన్నీ ఆమెకే సొంతం

May 9 2021 9:37 AM | Updated on May 9 2021 12:40 PM

Sai Pallavi Birthday Special: Family, Movies, Age - Sakshi

తన డాన్స్‌తో, నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. మలయాళం చిత్రం ‘ప్రేమమ్‌’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే ​లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. ఈ రోజు(మే 9) ఈ నేచురల్‌ బ్యూటీ పుట్టిన రోజు. నేటితో ఈ భామ 29వ పడిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి..

సాయిపల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోటగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఎనిమిదో తరగతిలో ఉండగా ఈమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్మేట్గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో నటించింది. ఇలా వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. తండ్రి సలహా మేరకు జార్జియాకి వెళ్లి వైద్యవిద్యను అభ్యసించింది.



సూపర్‌ హిట్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ
తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన 'ప్రేమమ్' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి భామ. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులో ‘ఫిదా’ సినిమా చేసింది. ఇందులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఆ తర్వాత తెలుగులో సాయిపల్లవికి అవకాశాలు క్యూకట్టాయి. నానితో ఎంసీఏ చిత్రంలో నటించింది. అందులో కూడా సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా తెలుగులో దూసుకెళ్తూనే.. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా నటించిన‘మారి-2’తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు కోలీవుడ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. మారి-2, దియా అనే తమిళ హార్రర్ మూవీతో పాటు సూర్యతో కలిసి నటించిన 'ఎన్జికే' చిత్రం కూడా భారీ ఫ్లాప్‌ని మూటగట్టుకున్నాయి.

టాలీవుడ్‌లో మాత్రంలో ఒక్క ‘పడి పడి లేచే మనసు’ తప్ప అన్ని సినిమాలు సూపర్‌ హిట్టే. ప్రస్తుతం ఈ నేచురల్‌ బ్యూటీ తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తుంది. రానా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. నక్సలైట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.  ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ రికార్డులన్నీ సాయిపల్లవికే సొంతం
సాయిపల్లవి, ధనుష్‌ జంటగా నటించిన ‘మారి-2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌ యూట్యూబ్‌లో 1.14 బిలియన్లకు పైగా వ్యూస్‌ సంపాదించి రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించి సాంగ్‌గా ‘రౌడీ బేబీ’ రికార్డుకెక్కింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే' సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక తాజాగా లవ్‌స్టోరీ 'సారంగదరియా' సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్లో ఒక హీరోయిన్ పాటకు ఇంతటి ఆదరణ రావడం ఒక్క సాయి పల్లవికే సొంతం.

Advertisement
 
Advertisement
Advertisement