రియాకు ఈడీ సమన్లు జారీ.. స్పందన లేదు 

Rhea Chakraborty Has 1 Flat worth Rs 85 Lakh in Khar Mumbai - Sakshi

రియా పేరుతో ముంబైలో రూ.85 లక్షల విలువైన ప్లాట్‌

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడికి చెందిన ప‌లు బ్యాంకుల్లో సుమారు 15కోట్ల రూపాయలు మాయమైన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేకే సింగ్ ఫిర్యాదుతో రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె కుటుంబ సభ్యుల మీద ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నట్లు ఈడీ సన్నిహత వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అధికారులు రియా పేరు మీద ఉన్న ఆస్తుల గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రియా పేరు మీద ముంబై ఖర్‌ ప్రాంతంలో 85 లక్షల రూపాయల విలువైన ప్లాట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత ఖరీదైన ప్లాట్‌ కొనడానికి ఆమెకు డబ్బులు ఎలా వచ్చాయనే దాని గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. (సుశాంత్ కేసులో కీలక మలుపు : రియాకు షాక్)

ప్లాట్‌ విలువ 85 లక్షల రూపాయలు కాగా.. దీనిలో హౌస్‌లోన్‌ వాటా 60 లక్షల రూపాయలు. బిల్డర్‌ పేరు శివాలిక్‌. ప్టాట్‌ విస్తీర్ణం 550 చదరపు అడుగులు. ఈ ప్లాట్‌ ఖర్‌ సబ్‌వేకు సమీపంలో ఉంది. అంతేకాక రియా తండ్రి రిటైర్డ్‌ డిఫెన్స్‌ అధికారి పేరు మీద మరో ప్లాట్‌ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీన్ని 2012లో కొనుగోలు చేసి.. 2016లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్లాట్‌ విలువ 60 లక్షల రూపాయలు. 1130 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్‌ రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఉల్వేలో ఉన్నట్లు సమాచారం. అంతేకాక ఈడీ ద‌ర్యాప్తులో రియా చ‌క్ర‌వ‌ర్తి ఆదాయం 10 నుంచి 14 ల‌క్ష‌లకు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) రికార్డుల ప్రకారం గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా రియా చక్రవర్తి నికర ఆస్తి విలువ 10 లక్షల రూపాయల నుంచి 12 లక్షలకు, ఆపై14 లక్షల రూపాయలకు పెరిగిన‌ట్లు తెలిపింది. (సుశాంత్ ఖాతా‌ నుంచి 15 కోట్లు మాయం!)

తక్కువ నికర విలువ ఉన్నప్పటికీ, రియా ముంబైలో రెండు ఆస్తులను కొనుగోలు చేసింది. అందులో ఒక‌ ప్రాప‌ర్టి రియా పేరుతో ఉండ‌గా, మ‌రోటి ఆమె కుటుంబ సభ్యుల పేరుతో ఉంది. ఆ ప్రాప‌ర్టీ కొనుగోలు చేసేందుకు పెద్ద‌ మొత్తంలో న‌గ‌దు ఎవ‌రు ఇచ్చారో తెలియాల్సి ఉంది. ఈడీ అధికారులు రియా ఆస్తుల‌కు చెందిన ప‌త్రాల్ని ఆమె కుటుంబ‌స‌భ్యుల నుంచి తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంతేకాక ఈడీ అధికారులు రియాకు మెయిల్ ద్వారా సమన్లు జారీ చేశారు. ఆమెను శుక్రవారం (ఆగస్టు 7) ప్రశ్నించడానికి హాజరు కావాలని కోరారు. కానీ ఇంత వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న రాలేదని సమాచారం..
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top