రెడ్‌ మూవీ రివ్యూ

Red Telugu Movie Review And Rating - Sakshi

టైటిల్‌ : రెడ్‌
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : రామ్‌ పోతినేని, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్‌, సంపత్‌ రాజ్‌, వెన‍్నల కిషోర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ :  శ్రీ స్రవంతి మూవీస్
నిర్మాత :  ‘స్రవంతి’రవికిశోర్
దర్శకత్వం : తిరుమల కిశోర్
సంగీతం :  మణిశర్మ
సినిమాటోగ్రఫీ :  సమీర్‌ రెడ్డి
ఎడిటర్‌ :  జునైద్ సిద్దిఖీ
విడుదల తేది : జనవరి 14, 2021

సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్‌ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న రామ్‌,  ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఇప్పుడు అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని తనకు గతంలో‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్'  అనే సినిమా చేశాడు. తమిళ్ మూవీ తడమ్‌ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో రామ్‌ తొలి సారిగా డ్యూయల్‌ రోల్‌ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు‘రెడ్‌’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్‌ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా?  కిశోర్ తిరుమల,రామ్‌ కాంబో హ్యాట్రిక్‌ విజయం సాధించిందా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ
సిద్దార్థ్(రామ్‌) ఒక సివిల్‌ ఇంజనీర్‌. తాను పని చేసే ఆఫీస్‌లోనే మహిమా(మాళవికా శర్మ)అనే యువతిని చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెతో వ్యక్తం చేయడానికి నానా ఇబ్బందులు పడుతాడు. చివరకు ఎలాగోలా తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పేస్తాడు. ఆమె కూడా సిద్దార్థ్‌ను ఇష్టపడుతుంది. కొద్ది రోజుల్లో పెళ్లికూడా చేసుకోవాలనుకుంటారు. కట్‌ చేస్తే.. ఆదిత్య(రామ్‌) ఓ తెలివైన దొంగ.  చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో.. జల్సాలు చేస్తుంటాడు. పేకాటలో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటాడు. ఇలా  ఒకసారి తన ఫ్రెండ్‌ వేమ(సత్య) దాచుకున్న డబ్బులు తీసుకొని వెళ్లి పేకాటలో పొగుట్టుకుంటాడు. దాని వల్ల వేమ ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు. తన స్నేహితుడిని కాపాడటం కోసం ఆదిత్య 9 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఓ రౌడీకి ఇస్తాడు. ఇదిలా ఉంటే.. ఆకాశ్‌ అనే ఓ యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఈ కేసు సీఐ నాగేంద్ర కుమార్‌(సంపత్‌ రాజ్‌), ఎస్సై యామిని(నివేదా పేతురాజ్) ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపడతారు. ఇక ఈ కేసులో సిద్దార్థ్‌ను ఇరికించడానికి సీఐ నాగేంద్ర కుట్ర చేస్తాడు. అసలు ఈ హత్యకు సిద్దార్థ్‌, ఆదిత్యలకు సంబంధం ఏంటి? ఇద్దరిలో ఆకాశ్‌ని ఎవరు హత్య చేశారు? సీఐ నాగేంద్రకు, సిద్దార్థ్‌కు మధ్య ఉన్న గొడవేంటి? సిద్దార్థ్‌, ఆదిత్యల మధ్య సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును చేధించారా లేదా? అనేదే మిగత కథ

నటీనటులు
రెండు విభిన్న పాత్రలో కనిపించిన రామ్‌.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. స్టైల్‌, యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని  మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. సిద్దార్థ్‌ పాత్రలో క్లాస్‌గా కనిపించి మెప్పించిన రామ్‌.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అలరించాడు. తన నటనతో మరోసారి ఎనర్జిటిక్ స్టార్ అని నిరూపించుకున్నాడు.  ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. మహిమా పాత్రలో మాళవికా శర్మ మెప్పించారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన ముద్రవేశారు. మాళవిక శర్మ‌-రామ్ రొమాన్స్ బాగా పండింది. లిప్ లాక్‌లతో హీటెక్కించారు. ఇక అమాయకపు యువతి పాత్రలో అమృతా అయ్యర్‌ అద్భుతంగా నటించాడు. సంపత్‌ రాజ్‌, వెన‍్నల కిషోర్‌, సత్య తమ పరిధిమేర నటించారు. 

విశ్లేషణ
‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి సూపర్‌ హిట్ల తర్వాత తిరుమల కిశోర్, రామ్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం రెడ్‌.  ‘ఇస్మార్ట్ శంకర్'లాంటి సూపర్‌ హిట్‌ తర్వాతా రామ్‌ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ‘రెడ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను కొంతమేర దర్శకుడు అందుకున్నాడు. తమిళ్ మూవీ తడమ్‌కు ఇది రీమేకే అయినా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు చేసి మెప్పించాడు. ఫస్టాఫ్‌లోనే ఇద్దరు రామ్‌లను తెరపై పరిచయం చేసిన దర్శకుడు... ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో సినిమా చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఇంటర్వేల్‌ ముందు ఓ ట్విస్ట్‌ ఇచ్చి.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని క్రియేట్‌ చేశాడు. ప్లాష్‌బ్యాక్‌ ట్విస్ట్‌లు కూడా ఆడియన్స్‌కి కథపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తాయి.

అయితే రామ్‌లోని ఎనర్జిటిక్‌ని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ.. సినిమా స్లోగా రన్‌ అవుతున్న భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ప్లాష్‌బ్యాక్‌లో రామ్‌ తల్లిని చూపించిన విధానం కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచు​. సినిమాలోని డైలాగ్స్‌ బాగుండటంతో పాటు ఆలోచించే విధంగా చేస్తాయి. ‘రామాయణం మగాళ్లు కాకుండా ఆడాళ్లు రాసిఉంటే.. వారిపై అనుమానం ఉండేది కాదు అని ఒక్క డైలాగ్‌తో మహిళల బాధను తెలియజేశాడు. ‘నచ్చింది తినాలనుకున్నా.. తినకపోతే ఏమౌతుందిలే అనుకునే బతుకులు వాళ్లవి’ అంటూ మధ్యతరగతి బతుకులు ఏంటో తన డైలాగ్స్‌తో తెలియజేశాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. మణిశర్మ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఒక పాట మినహా మిగిలినవి అంతంత మాత్రమే అయినా, తనదైన బిజీఎంతో మ్యాజిక్‌ చేశాడు. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రెడ్‌ మరీ ఉత్కంఠభరితమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కాదు కాని చూడాల్సిన చిత్రమే.

ప్లస్ పాయింట్స్ :
రామ్‌ నటన
కథలోని ట్విస్టులు
సెకండాఫ్‌

మైనస్‌ పాయింట్స్‌
స్లో నెరేషన్‌
ఫస్టాఫ్‌లొని కొన్ని సీన్లు

అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top