83 Movie Review: 1983 వరల్డ్‌ కప్‌ను తెరపై చూపించిన '83' మూవీ రివ్యూ

Ranveer Singh 83 Movie Review In Telugu - Sakshi

టైటిల్‌: 83
నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, జీవా, హార్దీ సంధు, తాహీర్‌ భాసిన్, చిరాగ్ పాటిల్‌, సాకిబ్‌ సలీమ్‌ తదితరులు
దర్శకుడు: కబీర్‌ ఖాన్‌
నిర్మాతలు: రణ్‌వీర్ సింగ్‌, దీపికా పదుకొణె, కబీర్ ఖాన్‌, విష్ణు వర్దన్‌ ఇందూరి, సాజిద్ నడియడ్‌వాలా, రిలియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌
సినిమాటోగ్రఫీ అసీమ్‌ మిశ్రా
ఎడిటింగ్‌ నితిన్‌ బెద్‌
సంగీతం: జూలియస్‌ పేకియం
స్వరాలు: ప్రీతమ్‌
విడుదల: డిసెంబర్‌ 24, 2021

క్రికెట్‌ను గ్రౌండ్‌లో, టీవీల్లో చూసి ఎంజాయ్‌ చేయడమే కాదు సినిమాగా వెండితెరపై ఆవిష్కరించిన అంతే ఉత్సాహం చూపిస్తారు అభిమానులు. క్రికె​ట్‌.. అంటే కేవలం ఒక ఆట కాదు. ఎందరో అభిమానులకు అది ఒక ఎమోషన్‌. కుల మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన మతం క్రికెట్‌. ఈ మతం 1983 భారత క్రికెట్ టీమ్‌ సాధించిన వరల్డ్‌ కప్‌తో పునాది వేసుకుందని చెప్పవచ్చు. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన తాజా సినిమా '83'. ఈ సినిమాలో భారతదేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా జర్నీని వెండితెరపై ఆవిష్కరించారు. అప్పుడు జరిగిన మ్యాచ్‌ను కొంతమంది టీవీల్లో వీక్షించగా.. మరికొంతమంది రేడియోల్లో విన‍్నారు. టీమిండియా విజయాన్ని తమ గెలుపుగా భావించి సంబురాలు చేసుకున్నారు. తర్వాతి తరానికి 25 జూన్‌, 1983 ఒక చరిత్ర. ఆ చరిత్రను వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌. మరీ ఈ రోజు విడుదలైన '83' సినిమా ఎలా ఉందంటే?

కథ:
1983లో భారత్‌ వరల్డ్‌  కప్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఇండియా టీమ్‌ను ఒక జట్టుగా కూడా చూడలేదు క్రికెట్‌ ప్రపంచం.  అనేక అవమానాలు అడుగడునా ఎదుర్కొన్న భారత జట్టు వరల్డ్‌ కప్‌ ఫైనల్ వరకు ఎలా చేరింది. అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్‌ గెలుచుకున్న వెస్టండీస్‌పై ఎలాంటి అంచనాలు లేని భారత్‌ గెలిచి వరల్డ్‌ కప్‌ ఎలా కొల‍్లగొట్టింది. ఈ క్రమంలో ఇండియన్‌ క్రికెటర్లకు కుటుంబ సభ్యులకు ఉన్న రిలేషన్‌ ఎలా ఉంది. వరల్డ్‌ కప్‌ గురించి ఇండియన్‌ క్రికేట్‌ టీమ్‌ సభ్యులు ఏమనుకున్నారు. కప్‌ గెలవడానికి ముందు క్రికెట్‌లో ఇండియాను భారతీయులు, విదేశీయులు ఎలా చూశారనేదే 83 చిత్రం కథ(83 movie review). 

విశ్లేషణ:
క్రికెట్‌లో తమకంటూ ఒక  స్థానం ఉండాలని పరితపించిన సగటు భారతీయుడి కథ ఇది. 1983 వరల్డ్‌ కప్‌ను భారత్‌ గెలుచుకోవడం ఒక భావోద్వేగపు సంఘటన. అందుకే దీన్ని ఒక సినిమాలా చూడలేం. సగటు సినీ ప్రేక్షకుడిగా కాకుండా క్రికెట్‌ ఆడే చిన‍్న పిల్లాడిలా చూస్తే సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. 1983లో హర‍్యనా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ సారథ్యంలో ఇండియా ప్రపంచ కప్‌ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకుడికి కథ ఎలాగు ముందే తెలుసు. కాబట్టి తెలిసిన కథను ప్రేక్షకుడు తెరపై చూడాలంటే సినిమా బాగా కనెక్ట్‌ కావాలి. అంటే అప్పుడు జరిగిన సంఘటనలు, అప్పటి ఎమోషన్‌ను కళ్లకు కట్టనట్లు చూపించాలి. ఆ ఎమోషన్‌ను సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కొనసాగించడంలో దర్శకుడు కబీర్ ఖాన్‌ కొంతవరకు విజయం సాధించాడనే చెప్పవచ్చు. వరల్డ్‌ కప్‌ సిరీస్ ప్రారంభం నుంచి కప్‌ గెలిచే వరకూ భారత్ ఎలా నిలదొక్కుకుందని దర్శకుడు బాగా చూపించాడు. అప్పటివరకు ఇండియాలో మత ఘర్షణలు అనేకంగా జరిగేవి. ఈ మత ఘర్షణలకు ఒక్కసారిగా ముగింపు పలికింది 1983 వరల్డ్‌ కప్‌. ఈ అంశాన్ని తెరపై ఆవిష్కరించి విజయం సాధించాడు కబీర్‌ ఖాన్‌. ఈ సినిమాలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. 

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రోజున ఇండియా-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో భారత సైన్యానికి పాక్‌ ఆర్మీ ఒక్క రోజు కాల్పుల విరమణ ఇవ్వడం, ఇంగ్లాండ్‌లో పనిచేస్తున్న భారతీయుల ఎమోషన్‌, పలు చోట్ల అల్లర్లను సినిమాలో సాధ్యమైనంత వరకూ బాగానే చూపించారు. అయితే కపిల్ భార్య రోమి భాటియా, మదన్ లాల్ భార్య అను మోహన్‌ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతుంద‌ని స్టేడియం నుంచి హోట‌ల్‌కు వెళతారు. ఈ దృశ్యాలను మాత్రం ప్రేక్షకుల హృదయాలకు తాకేలా తీయడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. సినిమా ఫస్టాఫ్‌ స్లోగా నడిచినట్లు అనిపించినా.. సెకాండాఫ్‌ మాత్రం బాగుంటుంది.  క్యాస్టింగ్‌,  సాంకేతికంగా బాగానే వర్క్‌ చేసినట్టు కనిపిస్తుంది. అప్పటి కాలాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఆర్ట్‌, కమెరా పనితనం మొత్తంగా చిత్ర బృందం ఎఫర్ట్‌ స్క్రీన్‌పై కనిపించింది. చిత్రంలో 1983 వరల్డ్‌  కప్‌లో జరిగిన పలు దృశ్యాలను చూపించడం బాగుంది. అప్పటి మ్యాచ్‌ను మళ్లీ లైవ్‌లో చూసిన అనుభూతిని ఇస్తుంది.  సినిమాలో అక్కడక్కడ పలువురు ప్రముఖ క్రికెటర్లు కనిపించడం ఆహ్లాదకరంగా ఉంటుంది.  

ఎవరెలా చేశారంటే ?

సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, పంకజ్‌ త్రిపాఠి వంటి భారీ తారగణంతో అప్పటి విజయాన్ని తెరపై చూపించిన ప్రయత్నమిది. కపిల్ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. గెటప్‌ దగ్గర నుంచి ఆట ఆడే తీరు వరకు కపిల్‌ను దింపేశాడు రణ్‌వీర్‌ సింగ్‌. ఆ పాత్రకు ఏం చేయాలో అంతా చేసి విజయం సాధించాడు. కపిల్‌ దేవ్‌ భార్య రోమి భాటియాగా దీపికా పదుకొణె బాగానే ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర ప్రభావం సినిమాలో అంతగా కనిపించదు. మాన్‌ సింగ్‌గా పంకజ్‌ త్రిపాఠికి మరో ఛాలెంజ్ రోల్‌ దక్కింది. ఆ పాత్రకు తగిన న్యాయం చేశాడు పంకజ్‌ త్రిపాఠి. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా తన నటనతో మెప్పించాడు. మిగతా నటీనటులు వారి పాత్రలకు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు. 

ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. రణ్‌వీర్‌ సింగ్‌కు హీరో సుమంత్‌ డబ్బింగ్‌ చెప్పగా.. జీవాకు నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ చెప్పిన డబ్బింగ్‌ బాగా సూట్‌ అయింది. మొహిందర్ అమర్‌నాథ్‌ పాత్రలో సాకీబ్‌ నటించగా.. అతడి తండ్రి పాత్ర లాలా అమర్‌నాథ్‌గా మొహిందర్‌ అమర్‌నాథ్‌ నటించడం విశేషం. అలాగే సందీప్‌ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌ నటించాడు. 1983 వరల్డ్ కప్‌ విశేషాలు, హైలెట్స్‌, అభిమానుల సందడి ఎలా ఉందో చూడాలంటే '83' చిత్రం మంచి ఎంపిక. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top