
రామ్ పోతినేని-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలుకా. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజైంది. రామ్ పోతినేని ఎనర్జీ, మాస్ డైలాగ్స్‌తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.
ఈ చిత్రంలో హీరో ఉపేద్రకు రామ్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి.. ఆంధ్ర కింగ్ (ఉపేంద్ర)కు వీరాభిమానిగా మారిన హీరోకి వచ్చిన సమస్యలు ఏంటి? తన హీరో కోసం ఆయన ఏం చేశాడు? అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.
‘సినిమాకు ఎందుకు తీసుకెళ్లావ్.. పిల్లాడిని ఇలానే పాడు చేసి పెట్టు.. ’ అని హీరో తల్లి చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. ‘మీ హీరో చెప్పినదానికన్నా.. ఈ హీరో చెప్పిందే బాగా నచ్చింది’, ‘బొమ్మ బ్లాక్ బస్టర్ అక్కడ.. నిన్ను నైజాంలో కోసి గుంటూరులో కారం పెట్టి సీడెడ్‌లో ఫ్రై చేజేసి ఆంధ్రాలో పోలావ్ వండేస్తే..మొత్తం అయిపోతది’, ‘ఫ్యాన్..ఫ్యాన్ అని గుడ్డలు చింపేసుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులుగా మీవీ.. ఛీ ఛీ’ అని ఓ వ్యక్తి(మురళి శర్మ) చెప్పే డైలాగ్ టీజర్ ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. నవంబర్ 28 ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.