రవిని కాదు.. ముందు వాళ్లను అరెస్ట్‌ చేయండి: ఆర్జీవీ | Ram Gopal Varma comments on iBomma Ravi and movie lovers | Sakshi
Sakshi News home page

రవిని కాదు.. ముందు వాళ్లను అరెస్ట్‌ చేయండి: ఆర్జీవీ

Nov 22 2025 1:10 PM | Updated on Nov 22 2025 2:03 PM

Ram Gopal Varma comments on iBomma Ravi and movie lovers

సినీ పరిశ్రమను ఊపిరాడకుండా చేస్తున్న పైరసీ సమస్య గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి అరెస్ట్‌ తర్వాత కూడా పైరసీ ఆగదని ఆయన చెప్పారు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం, పోలీసింగ్ చాలా బలహీనంగా ఉండటం వల్లనే ఇలాంటి వెబ్‌సైట్లు వస్తున్నాయనుకుంటే పొరపాటే అన్నారు.  పైరేటెడ్ సినిమా చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నంత కాలం వారికి సర్వీస్‌ అందించడానికి రవి లాంటి సరఫరాదారులు ఎల్లప్పుడూ ఉంటారని ఆర్జీవీ పేర్కొన్నారు.

చాలామంది నెటిజన్లు రవిని రాబిన్‌ హుడ్‌తో పోలుస్తున్నారని ఆర్జీవి  (RGV)  ఇలా అన్నారు. 'రాబిన్ హుడ్ హీరో కాదు.. నేటి నిర్వచనాల ప్రకారం చూస్తే, అతను ప్రపంచంలోనే మొట్టమొదటిగా నమోదైన ఉగ్రవాది. అతను ఉన్నవారిని దోచుకుని, చంపి, లేనివారికి ఇస్తాడు. అలా అయితే ధనవంతులు చేసిన ఏకైక నేరం వారు ధనవంతులు కావడమేనా.. కష్టపడి ఆర్థికంగా విజయం సాధించిన వారిని దోచుకోవడం ఎంత నీచమైనదో ఊహించుకోండి. నేరస్థుడిని సాధువుగా చూపించడానికి టన్నుల కొద్దీ అజ్ఞానం అవసరం' అని  ఆర్జీవీ పేర్కొన్నారు.

పైరసీ విషయంలో లాజిక్స్‌ కొన్ని పాయింట్స్‌ చెబుతున్నవారికి కూడా వర్మ కౌంటర్‌ ఇచ్చారు. 'సినిమా ఖరీదైనదా..? -పైరసీ ఓకే, పాప్‌కార్న్ ఖరీదా..? — సినిమాను లీక్ చేయండి, మూవీ టికెట్ రేట్లు ఎక్కువా..? -పైరసీ ఓకే ఈ లాజిక్ ప్రకారం చూస్తే.. BMW కారు ఖరీదైతే షోరూమ్‌ను దోచుకోవాలి కదా.. మురికివాడలో ఉన్న అందరికీ ఆ కార్లను ఇవ్వాలి కదా.. అలా ఎందుకు చేయరని ప్రశ్నించారు. బంగారం (Gold) ఖరీదైనదే కదా.. ఆ దుకాణాన్ని దోచుకుని ఉచితంగా ఎందుకు పంపిణీ చేయరంటూ.. అన్ని వస్తువులకు ఇదే లాజిక్ వర్తిస్తుందని గుర్తుచేశారు. ఇలాంటి ఆలోచనలు సమాజంలో అరాచకానికి దారితీస్తాయని వర్మ హెచ్చరించారు. 

పైరసీ ద్వారా సినిమా చూడటం వల్ల కొంతమందికి డబ్బు ఆదా చేయవచ్చు.. మరికొందరికి థియేటర్‌కి వెళ్లడం కంటే లింక్‌పై క్లిక్ చేసి సినిమా చూడటం ద్వారా సమయం ఆదా కావచ్చన్నారు. తనతో సహా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా ఇదే కారణంతో పైరసీ కంటెంట్‌ను చూస్తారని వర్మ ఓపెన్‌గానే చెప్పారు. నిజంగా పైరసీని ఆపాలంటే చూసే వారినీ నేరస్తులుగా పరిగణించాలని పేర్కొన్నారు. పైరసీ ద్వారా సినిమా చూస్తున్న 100 మందిని అరెస్టు చేసి వారి పేర్లను ప్రచారం చేస్తే ఆగిపోయే ఛాన్స్‌ ఉందన్నారు. పైరసీ విషయంలో నైతికత (Moral) పనిచేయదని కేవలం భయం మాత్రమే పనిచేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement