ప్రేమకు నిర్వచనం నా తమ్ముడు

Rajnikanth seeks blessings from his brother ahead of political debut - Sakshi

– సత్యనారాయణ

‘‘నా తమ్ముడు మంచి మనిషి. ప్రేమకు నిర్వచనం’’ అన్నారు రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణ. జనవరిలో కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన రజనీకాంత్‌ ఈ సందర్భంగా తన అన్నయ్య సత్యనారాయణ ఆశీస్సులు తీసుకోవడానికి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం (డిసెంబర్, 12) రజనీ పుట్టినరోజు. చెన్నైలో ఆయన బర్త్‌డే వేడుకలు జరిగాయి. తమ్ముడికి ఏం బహుమతి ఇచ్చారు? అసలు పుట్టినరోజులకు ఏమైనా ఇచ్చి పుచ్చుకుంటారా? అని  సత్యనారాయణను ‘సాక్షి’ అడిగితే – ‘‘అలాంటివి ఏమీ లేదు. మా తమ్ముడు చూపించే ప్రేమను నేను పెద్ద బహుమతిలా భావిస్తాను. నా ప్రేమను ఆయన అలానే అనుకుంటారు.

కుటుంబ సభ్యులంటే ఆయనకు చాలా ప్రేమ. కుటుంబం అనే కాదు.. మనుషులందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి’’ అన్నారు. మీ తమ్ముడి రాజకీయ భవిష్యత్తు గురించి ఏమంటారు? అంటే, ‘‘ఇన్నేళ్లుగా సినిమా హీరోగా ఉన్నారు. ఆయనకు అన్ని విషయాలూ తెలుసు. బాగా రాణిస్తారు’’ అన్నారాయన. ‘‘నా ఆరోగ్యం బాగుంది. తమ్ముడి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. తను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఎంత బిజీగా ఉన్నా నా క్షేమసమాచారాలు తెలుసుకుంటారు’’ అన్నారు సత్యనారాయణ. ఇదిలా ఉంటే ఈ 15 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొననున్నారు రజనీకాంత్‌.

అందరికీ ధన్యవాదాలు
‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులకు, ప్రపంచవ్యాప్తంగా నా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న అభిమాన దేవుళ్లకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశారు రజనీకాంత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top