ఐశ్వర్య డైరెక్షన్‌లో అతిథి పాత్రలో తలైవా

Rajinikanth To Make Special Appearance In Lal Salaam Movie - Sakshi

తమిళ సినిమా: రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం రాబోతోంది. ఈ మేరకు శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో 2012లో ధనుష్, శృతిహాసన్‌ జంటగా 3 చిత్రం, నటుడు గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా 2015లో వై రాజా వై అనే మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్‌ తర్వాత తాజాగా ఆమె సినీ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు.. ఈ చిత్రంలో సపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటించనున్నారు.

ఈయన ఇంతకుముందు తన రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో కోచ్చడయాన్‌ అనే యానిమేషన్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి లాల్‌ సలాం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తనయ దర్శకత్వంలో తలైవా అంట ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు అధర్వ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన ఇందులో నటించడం లేదు. తాజాగా నటుడు విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని, విష్ణు రంగసామి ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నట్టు లైకా సంస్థ నిర్వాహకుడు తమిళ్‌ కుమరన్‌ తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top