
నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad).. ఈయన పండించిన హాస్యానికి, చేసిన సినిమాలకు ఫిదా అవ్వని ఫ్యామిలీ ఆడియన్స్ అంటూ ఎవరూ ఉండరనే చెప్పొచ్చు. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెలో స్థానం సంపాదించుకున్న ఈయన ఈ మధ్య వరుసగా నోరు జారుతూ విమర్శల పాలవుతున్నాడు. రాబిన్‌హుడ్ ఈవెంట్‌లో క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో కమెడియన్ అలీపై అతి చనువుతో బూతులు మాట్లాడుతూ సంబోధించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సహనటులకు కనీస గౌరవం ఇవ్వకుండా స్టేజీపైనే చులకన చేసి మాట్లాడటంతో నటుడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్
పదేపదే నోరు జారుతూ.. తను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను తనే స్వయంగా మంటగలుపుకుంటున్నారు. తాజాగా తానా 24వ మహాసభలకు వెళ్లిన రాజేంద్రప్రసాద్ అక్కడ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది డెట్రాయిటా? లేక బెజవాడా? తెలియట్లేదు. ఉన్నట్లుండి ఓ వ్యక్తి.. అన్నా.. నీ వల్లే బతికేస్తున్నాం అన్నాడు. నా వల్ల బతకడమేంటి? అని అడిగాను. అందుకా అబ్బాయి.. జీవితంపై విరక్తి కలిగినా, ఇంటికి వెళ్లిపోదాం అనిపించినా ఒక్కసారి మీ సినిమాలు చూడగానే అంతా మర్చిపోతున్నాం అన్నాడు.
దరిద్రంగా..
ఈ మాట నువ్వే కాదు నాయనా.. దివంగత ప్రధాని పీవీ నరసింహరావు గారు కూడా అన్నారు. ఆయన.. పెద్దపెద్ద సూట్‌కేసులు, కేసులు అయితే చివరకు నా సినిమా చూసి స్వాంతన పొందేవారు అని చెప్పుకొచ్చాడు. మాజీ ప్రధాని గురించి ప్రస్తావించేటప్పుడు కేసులు అని చెప్పడం ఏమీ బాగోలేదని పలువురు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అలాగే వెండితెరకు పరిచయమవడానికి ముందు సన్నగా, దరిద్రంగా సత్యసాయిబాబా జుట్టుతో ఉండేవాడిని అని కామెంట్ చేశాడు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి.
డప్పు కొట్టుకోవడమే పని
1977లో తన కెరీర్ మొదలైందన్న రాజేంద్రప్రసాద్ అప్పుడే తానా కూడా ప్రారంభమైందన్నాడు. ప్రతి ఇంట్లో కంచం, మంచంలాగా రాజేంద్రప్రసాద్ సినిమా కూడా ఉంటుందని సినారె తనతో అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అంత పెద్ద వేదికపై రాజేంద్రప్రసాద్.. తన గొప్పలు, చేసిన సినిమాల గురించి చెప్పుకుంటూనే ప్రసంగం ముగించాడు.
చదవండి: థియేటర్‌లో చిన్న చిత్రాలు.. ఓటీటీలో 26 సినిమాలు/ సిరీస్‌లు